TG Assembly Session: డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి…
TG Assembly Session: డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఎన్ని రోజుల పాటు సమావేశాలు జరపాలనేది బిఏసీ భేటీలో నిర్ణయిస్తారు.
TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈనెల 9న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
తెలంగాణలో సంక్రాంతి తరువాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు బంధు విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే పలు అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అర్హులైన రైతులకే అందించాలనే నిర్ణయానికి వచ్చింది.
తెలంగాణలో కొత్తగా తీసుకురానున్న ఆర్వోఆర్ చట్టంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కులగణన సర్వే ద్వారా వచ్చే గణాంకాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా? లేదా? అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.
డిసెంబర్ 9వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళణ, రైతు భరోసా వంటి కీలక అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం.. గురుకుల పాఠశాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, లగచర్ల ఘటన, రైతు భరోసా, బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారి మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్..సమావేశం ముగియక ముందే వెళ్లిపోయారు. ఈ సారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ప్రభుత్వ పెద్దల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంది.