Swatantrya Veer Savarkar ott release date: స్వాతంత్య్ర వీర్ సావర్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఆ ప్రత్యేకమైన రోజునే..
Swatantrya Veer Savarkar ott release date: స్వాతంత్య్ర వీర్ సావర్కర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ వివాదాస్పద స్వాతంత్య్ర సమరయోధుడి మూవీ ఓటీటీలో అడుగుపెట్టబోతోంది.
Swatantrya Veer Savarkar ott release date: స్వాతంత్య్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషించిన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ స్వాతంత్య్ర వీర్ సావర్కర్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమాలో ఈ వివాదాస్పద నేత పాత్రను బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా పోషించాడు. మార్చి 22న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మే 28 నుంచి ఓటీటీలోకి రానుంది.
స్వాతంత్య్ర వీర్ సావర్కర్ ఓటీటీ రిలీజ్
వినాయక్ దామోదర్ సావర్కర్.. మనందరికీ వీర్ సావర్కర్ గా పరిచయం. ఆయన జీవితం ఆధారంగా ఈ స్వాతంత్య్ర వీర్ సావర్కర్ సినిమాను తెరకెక్కించారు. రణ్‌దీప్ హుడా ఆ పాత్రలో కనిపించగా.. ఆయన భార్య యమునా బాయిగా అంకితా లోఖాండే నటించింది. ఈ సినిమా ఇప్పుడు మే 28న జీ5 (Zee5) ఓటీటీలోకి రాబోతోంది.
ఆ రోజు వీర్ సావర్కర్ 141వ జయంతి సందర్భంగా ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించారు. మార్చి 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. రణ్‌దీప్ హుడానే ఈ మూవీని డైరెక్ట్ చేయడం విశేషం. అతనికి డైరెక్టర్ గా ఇదే తొలి సినిమా. ఈ పీరియడ్ డ్రామా ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకుంది. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.31.23 కోట్లు వసూలు చేసింది.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ స్వాతంత్య్ర పోరాటంలో వీర్ సావర్కర్ పాత్రపై పెద్ద చర్చే నడుస్తోంది. స్వాతంత్య్రం తీసుకురావడంలో ఆయన పాత్రేమీ లేదని కాంగ్రెస్ విమర్శిస్తుండగా.. బీజేపీ మాత్రం ఆయనను గొప్ప వీరుడిగా కీర్తిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన సినిమా కావడంతో స్వాతంత్య్ర వీర్ సావర్కర్ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఊహించినట్లే బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా సక్సెసైంది.
ఓటీటీ రిలీజ్‌పై రణ్‌దీప్ ఏమన్నాడంటే..
ఈ స్వాతంత్య్ర వీర్ సావర్కర్ మూవీలో నటించి, డైరెక్ట్ చేసిన రణ్‌దీప్ హుడా.. సినిమా ఓటీటీ రిలీజ్ పై స్పందించాడు. వీర్ సావర్కర్ 141వ జయంతి రోజే మూవీని ఓటీటీలోకి తీసుకొస్తుండటం ఆయనకు అందించే గొప్ప నివాళి అని అతడు అన్నాడు. ఈ ప్రాజెక్ట్ మొదలైన తర్వాత ఈ హీరో గురించి తాను ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని తెలిపాడు.
మూవీలో తాను వీర్ సావర్కర్ పాత్ర పోషించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. భారత చరిత్రలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకొని, వీర్ సావర్కర్ నిజంగానే వీరుడా కాదా అన్నది తెలుసుకోవడానికి ఈ సినిమాను ప్రతి భారతీయుడూ చూడాలని తాను కోరుకుంటున్నట్లు రణ్‌దీప్ అన్నాడు.