Telangana Mutton Shops : మనం తినే 'మటన్' ముక్క మంచిదేనా.. మాంసం కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి
Telangana Mutton Shops : తెలుగు రాష్ట్రాల్లో మాంసం ప్రియులు ఎక్కువ. ముఖ్యంగా తెలంగాణలో ఏ చిన్న సందర్భం వచ్చినా.. ముక్క లేకపోతే ముద్ద దిగదు. కానీ.. ఆ ముక్క ఎంత వరకు సేఫ్ అనే ప్రశ్నలు ఇటీవల ఎక్కువ అయ్యాయి. దానికి కారణం వ్యాపారుల స్వార్థం. అవును.. నాసిరకం మాంసం విక్రయాలు పెరిగిపోతున్నాయి.
ఆదివారం సెలవు కావడంతో మాంసం ప్రియులు కొనుగోళ్లకు ఎక్కువ మొగ్గుచూపుతారు. ఇటు పండగలు సమయంలోనూ మాంసం విక్రయాలు జోరుగా సాగుతాయి. మటన్, చికెన్ సెంటర్ల వద్ద వినియోగదారులు బారులుతీరుతారు. అయితే.. డిమాండ్ పెరగడంతో వ్యాపారులు స్వార్థం ప్రదర్శిస్తున్నారు. వినియోగదారులను మోసం చేస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు..
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. జీవాలు ఆరోగ్యమైనవేనా లేదా ధ్రువీకరించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వ్యాపారులు ఇష్టానుసారంగా విక్రయాలు జరుపుతున్నారు. నిబంధనల ప్రకారం.. మేకలు, గొర్రెలను జంతు వధశాల (కబేలా)లోనే వధించాలి. విధిగా శానిటరీ ఇన్‌స్పెక్టర్, పశుసంవర్ధక శాఖ వైద్యుడు పరిశీలించాలి.
రౌండ్ సీల్ తప్పనిసరి..
శానిటరీ ఇన్‌స్పెక్టర్, పశువైద్యాధికారి పర్యవేక్షణలో వధించిన మాంసంపై అధికారులు రౌండ్ సీల్ వేసింది మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. కానీ.. దాదాపు 75 శాతానికి పైగా వ్యాపారులు ఇళ్లు, దుకాణాల వద్దనే వధిస్తున్నారు. రోగాల బారినపడినవి, వయసు పైబడిన వాటిని వధించి అమ్మేస్తున్నారు. తెలంగాణలో నిత్యం క్వింటాళ్ల కొద్దీ మాంసం అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ.. అధికారులు ఎక్కడా తనిఖీలు చేసిన సందర్భాలు కనిపించవు.
ఈగలు.. దోమలు వాలుతున్నా..
మాంసం విషయం అలా ఉంటే.. దుకాణాలు అపరిశుభ్రత వాతావరణంలోనే కొనసాగుతున్నాయి. ఈగలు, దోమలు మాంసంపై వాలుతున్నా.. వ్యాపారులు వినియోగదారులకు మాంసం అంటగడుతున్నారు. దీంతో మాంసం తినేవారు రోగాల బారిన పడుతున్నారు. కొలతల నుంచి.. మటన్ క్వాలిటీ వరకూ వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకొండి..
మటన్ షాప్‌కు వెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలు. మటన్ షాపుల ముందు పొట్టేళ్లను వేలాడదీసి.. స్టాక్ ఉన్న మటన్‌ను విక్రయిస్తారు. సాధ్యమైనంత వరకు బయట కనిపించే మాంసాన్నే కొనాలి. ఫ్రిజ్‌లలో నిల్వచేసిన మటన్‌ను అస్సలు కొనొద్దు. మటన్ కొన్నప్పుడు బక్కి (పై లేయర్)ను తీసేయమని చెప్పాలి. ఇది ఉంటే మటన్ సరిగా ఉడకదు. గట్టిగా ఉంటుంది. ఫలితంగా తిన్నది అరగదు. అనారోగ్య సమస్యలు వస్తాయి.
మాంసాన్ని తూకం వేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇక డోర్ డెలివరీ మాంసాన్ని ఎంత తగ్గిస్తే.. అంత మంచిది. ఎన్నో రోజుల నుంచి నిల్వ చేసిన మాంసాన్ని వినియోగదారులకు అంటగడుతున్నారు. మాంసం కొనేటప్పుడు ఏ చిన్న అనుమానం వచ్చినా.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి.