Hyderabad Hotels: కుళ్లిపోయిన మాంసం.. సింథటిక్ ఫుడ్ కలర్స్.. ప్రముఖ హోటళ్లలో ఇదీ పరిస్థితి!
Hyderabad Hotels: హైదరాబాద్ మహా నగరంలోని పలు హోటళ్లపై ఇటీవల విమర్శలు పెరుగుతున్నాయి. కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్ ఇవ్వడం లేదు. ఇలాంటి ఆరోపణలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా ఆరాంఘర్ ఏరియా నిర్వహించిన తనిఖీల్లో హోటళ్లలోని డొల్లతనం బయటపడింది.
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. ఆరాంఘర్‌లోని గోల్డెన్ పేర్స్ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆ హోటల్ లోని పరిస్థితిని చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు అవాక్కయ్యారు. ఎఫ్‌బీవో రాష్ట్ర లైసెన్స్‌కు బదులుగా.. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో ఈ హోటల్‌ను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఫెస్ట్ కంట్రోల్ రికార్డ్‌లు, ఫుడ్ హ్యాండ్లర్‌ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవని గుర్తించారు.
హోటల్‌లోని కిచెన్, వంట సామాగ్రి నిల్వ చేసే గదులను అధికారులు పరిశీలించారు. ఈ హోటల్‌లో వంటగది కిటికీలు తీసి ఉంచారు. దీంతో బయట దుమ్ము అంతా వంటల్లో పడుతోంది. వంటగది అంతా ఈగలు, దోమలే కనిపించాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. రిఫ్రిజిరేటర్ లోపల పచ్చి మటన్ ముక్కలు ఉన్నాయని.. మాంసం అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో ఉన్నట్లు గుర్తించినట్టు వెల్లడించారు.
గడువు ముగిసిన పాల ప్యాకెట్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. స్టోర్ ఏరియాలో లేబుల్ లేని నెయ్యి ప్యాకెట్లు ఉన్నాయి. నాన్ వెజ్ స్టార్టర్స్‌లో సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ హోటల్‌లో పనిచేసే సిబ్బంది హెయిర్ క్యాప్‌లు, అప్రాన్‌లు లేకుండా పని చేస్తున్నారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుంటామని స్పష్టం చేశారు.
ఆరాంఘర్ ఏరియాలోనే ఇతర హోటళ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు. వాటిల్లోనూ నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. కేవలం హోటళ్లే కాకుండా.. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల క్యాంటీన్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ నాసిరకం పధార్థాలు వినియోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎలాంటి సమస్యలున్నా.. 91001 05795 నంబర్‌కు ఫోనే చేసి ఫిర్యాదు చేయొచ్చని వివరించారు.