Water Lamp Temple: నూనె, నెయ్యితో కాదు కేవలం నీళ్లతోనే దీపం వెలిగించే ఆలయం గురించి మీకు తెలుసా?-lamp burns with water of kalisindh river in madhyapradesh ghatiyaghat temple ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Water Lamp Temple: నూనె, నెయ్యితో కాదు కేవలం నీళ్లతోనే దీపం వెలిగించే ఆలయం గురించి మీకు తెలుసా?

Water Lamp Temple: నూనె, నెయ్యితో కాదు కేవలం నీళ్లతోనే దీపం వెలిగించే ఆలయం గురించి మీకు తెలుసా?

Ramya Sri Marka HT Telugu
Nov 28, 2024 08:00 AM IST

Water Lamp Temple: మధ్యప్రదేశ్‌లో నీటితోనే దీపం వెలిగించే ఈ ఆలయాన్ని జల్ దీప్ మందిర్ అని పిలుస్తుంటారు. కాలీసింద్ నదీ కిరణాల వెలుతురులో దేదీప్యమానంగా వెలుగులీనే ఈ ఆలయం వెనుక ఎన్నో రహస్యాలున్నాయి.

నూనె, నెయ్యితో కాదు కేవలం నీళ్లతోనే దీపం వెలిగించే ఆలయం గురించి మీకు తెలుసా?
నూనె, నెయ్యితో కాదు కేవలం నీళ్లతోనే దీపం వెలిగించే ఆలయం గురించి మీకు తెలుసా?

భారత్ లోని చాలా మందిరాల్లో మనకు తెలియని చాలా రహస్యాలు దాగి వున్నాయి. అవి అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చి అందరినీ అబ్బురపరుస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని ముక్కున వేలేసుకుని ఔరా అని ఆశ్చర్యపోయే వారు కొందరుంటే, దాని వెనుక నిజం కనుక్కునేందుకు ప్రయత్నించి దేవుని మహిమతో పోటీపడలేక నీరసించిపోయే వారు మరికొందరు. అటువంటిదే ఈ ఆలయ రహస్యం కూడా. మధ్యప్రదేశ్‌లోని శాజాపూర్ జిల్లాలో ఉన్న ఆలయంలో ఘటియాఘాట్ మాతాజీ కొలువై ఉంటారు. ఈ ఆలయ ప్రత్యేకత అనేక ఇతర ఆలయాల్లో వెలిగించినట్లుగా నూనె, నెయ్యిలతో కాకుండా నీటితోనే దీపాలు వెలిగించగలగడం.

ఈ అద్భుతం గురించి తెలుసుకుని దూరదూరాల నుంచి ఇక్కడకు విచ్చేసిన భక్త జనం ఆశ్చర్యంలో మునిగిపోతుంటారు. ఇంతటి మహిమ ఉన్న ఈ ఆలయ దర్శనానికి ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

మధ్యప్రదేశ్‌లోని శాజాపూర్ జిల్లాలో ఉన్న నల్కేడా గ్రామం చేరుకోవాలి. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలీసింద్ నదీ కిరణాలు పడే గాడియా గ్రామంలో ఈ ఘటియాఘాట్ మాతాజీ ఆలయం ఉంది.

నీటితో దీపం వెలిగించడం:

కొన్ని సంవత్సరాలుగా నీటితోనే దీపం వెలిగిస్తుంటారు. నెయ్యి లేదా నూనెకు బదులుగా నది నీటినే దీపం వెలిగించడానికి వినియోగిస్తున్నారు. కాలీసింద్ నది నీటిని దీపంలో పోసినప్పుడు అది జిగట ద్రవంగా మారిపోతుందట. ఆ పై దాని ఒత్తిని వెలిగిస్తే దీపం వెలిగిపోతూ ఉంటుందని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఈ దీపం వెనుక రహస్యాన్ని చేధించాలని ప్రయత్నించి చాలా మంది విఫలమయ్యారు.

ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే..

చాలా ఏళ్ల క్రితం ఆలయంలోని దీపాలను నూనె లేదా నెయ్యితోనే వెలిగించేవారట. ఒకరోజు అమ్మవారు పూజారికి కలలో కనిపించి నది నీటితో దీపం వెలిగించమని ఆదేశించారట. మరుసటి రోజు ఆ తల్లికి నమస్కరించుకుని విధేయతతో నదీ నీటితో దీపం అంటించగా దేదీప్యమానంగా వెలిగిపోయిందట. అప్పటి నుంచి ఇక అదే సంప్రదాయం కొనసాగుతూ ఉంది.

వర్షాకాలం వెలగదు:

ఏడాది పొడవునా నదీ నీటితో వెలిగించే ఈ సంప్రదాయం, వర్షాకాలంలో కొనసాగించరు. కాలీసింద్ నీటిమట్టం పెరగడం వల్ల ఆలయం నీటిలో మునిగిపోతుందట. దాని కారణంగా అక్కడ పూజలు కూడా సాధ్యపడవు. నవరాత్రుల సమయంలో నీటి మట్టం తగ్గడంతో మళ్లీ దీపం వెలిగిస్తారు.

ఈ అద్భుత దీపపు మహిమ చూపేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఘటియాఘట్ టెంపుల్ భారతీయ సంస్కృతికి, హిందూ విశ్వాసానికి ఒక ప్రత్యేక చిహ్నంగా నిలిచింది. వర్షాకాలం పూర్తయిన తర్వాత నుంచి ఘటియాఘట్ మాతాజీని దర్శించుకుని ఆమె అనుగ్రహం పొందేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయ దీపాన్ని మధ్యప్రదేశ్ వెళ్లిన వాళ్లు చూడకుండా అయితే తిరిగి రారు.

(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడంలేదు. వేరు వేరు వెబ్ సైట్లు, నిపుణుల సలహాల మేరకు వీటిని పొందుపరుస్తున్నాం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించేముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.)

Whats_app_banner