Srikalahasti Temple : స్వర్ణముఖి నదీతీరంలో శివాలయం.. శ్రీకాళహస్తి గురించి 7 విశేషాలు
Srikalahasti Temple : దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానిది ఒక్కో ప్రత్యేకత. అలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న దేవాలయం మన రాష్ట్రంలోనే ఉంది. అదే స్వర్ణముఖి నదీతీరంలో శ్రీకాళహస్తి దేవాలయం. శ్రీకాళహస్తి గురించి 7 విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉన్న దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి. ఈ ఆలయాన్ని 1516లో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. అద్భుతమైన శిల్పకళతో.. శ్రీకాళహస్తీశ్వరాలయం అలరారుతోంది. ఈ ఆలయం పరిసరాల్లో 36 తీర్థాలున్నాయి. ఈ ఆలయాన్ని సందర్శించి.. దేవదేవుడిని దర్శించుకుంటే.. మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే శ్రీకాళహస్తికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తువ భక్తులు తరలివస్తారు.
శ్రీకాళహస్తి విశేషాలు..
1.ఇతర శైవ క్షేత్రాలతో పోలిస్తే.. శ్రీకాళహస్తి శివలింగాన్ని అర్చకులు కూడా తాకకుండానే పూజలూ, అభిషేకాలూ చేస్తారు.
2.శ్రీకాళహస్తి శివలింగానికి ప్రాణమున్న శివలింగం అని పేరు. ఆ పరమేశ్వరుడి ఉఛ్వాశ నిశ్వాసాలకు అనుగుణంగానే మూలవిరాట్టుకు దగ్గరగా ఏర్పాటు చేసిన వాయుదీపాలు ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తాయి.
3.సాధారణంగా భక్తుడు భగవంతుడి పాదాల చెంత ఉంటాడు. కానీ.. శ్రీకాళహస్తిలో మాత్రం.. భక్తుడైన కన్నప్పకు కొండపైన ఆలయం ఉంది. కొండకింద శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం ఉంటుంది. మహా శివరాత్రికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం.
4.దేశంలోని దాదాపు అన్ని ఆలయాలనూ సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో మూసేస్తారు. కానీ.. శ్రీకాళహస్తి ఆలయం మాత్రం అప్పుడూ తెరిచే ఉంటుంది.
5.శ్రీకాళహస్తిలో 27 నక్షత్రాలు, 9 గ్రహాలను మేళవించిన ప్రత్యేక కవచం దేవదేవుడికి అమర్చి ఉంటుంది. రాహు కేతువుల తోపాటు గ్రహాలన్నీ స్వామి అధీనంలోనే ఉంటాయని అంటారు. అందుకే ఈ క్షేత్రం రాహుకేతు శాంతి పూజలకు ప్రసిద్ది.
6.శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహాల మండపం ఉండదు. కేవలం శనీశ్వరుడికే ఓ మందిరం కనిపిస్తుంది. శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి అభిషేకాలు చేయించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు.
7.ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ శిఖర దర్శనం. ఇక్కడ ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిల్చుని స్వామి, అమ్మవారు, భక్తకన్నప్ప శిఖరాలను భక్తులు దర్శించుకొని.. ఆధ్యాత్మికానందం పొందుతారు.
వైభవంగా బ్రహ్మోత్సవాలు..
శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి సదర్భంగా పది రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో జరిగే ఊరేగింపు, రథయాత్ర, తెప్పోత్సవాలను చూసి భక్తులు తరిస్తారు. స్వామి, అమ్మవార్ల కల్యాణం ఆలయంలో కాకుండా పట్టణం నడిబొడ్డున ఉండే పెళ్లి మండపంలో నిర్వహిస్తారు. ఈ సమయంలోనే కొన్ని జంటలు పెళ్లిళ్లు చేసుకుంటాయి. కార్తికమాసంలో ప్రతిరోజూ సాయంత్రం వెలిగించే ఆకాశదీపాన్ని చూసేందుకూ, ప్రత్యేక అభిషేకాలు చేయించేందుకూ, దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకునేందుకూ భక్తులు వేల సంఖ్యలో వస్తారు.