Guru Pradosha Vratam: నేడే గురు ప్రదోష వ్రతం: వ్రత కథ ఏంటి? ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలేంటి?-guru pradosha vratam date siginificance of vratham and vratha katha ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Guru Pradosha Vratam: నేడే గురు ప్రదోష వ్రతం: వ్రత కథ ఏంటి? ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలేంటి?

Guru Pradosha Vratam: నేడే గురు ప్రదోష వ్రతం: వ్రత కథ ఏంటి? ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలేంటి?

Ramya Sri Marka HT Telugu
Nov 28, 2024 06:00 AM IST

Guru Pradosha Vratam: ఈ సంవత్సరం గురు ప్రదోషం నవంబర్ 28 గురువారం అంటే నేడు వచ్చింది. వ్రత కథ వినకపోతే గురు ప్రదోష దీక్ష అసంపూర్ణమని భావిస్తారు భక్తులు. ఈ రోజున శివుడి అనుగ్రహం కోసం ఉపవాస దీక్షను చేపట్టిన వారు వ్రత కథను తప్పక వినాలి లేదా చదవాలి.

గురు ప్రదోష వ్రత కథ
గురు ప్రదోష వ్రత కథ

ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి నాడు గురు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సారి ప్రదోష వ్రతం నవంబర్ 28 రోజున గురు ప్రదోష వ్రతం జరుపుకుంటున్నారు. హిందూ పురాణాల ప్రకారం ప్రదోష వ్రతం రోజు శివ కుటుంబాన్ని పూజించేందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పరమేశ్వరుడి ఆయన కుటుంబాన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయని, సంపద, కీర్తి, శ్రేయస్సు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజున ఉపవాస దీక్ష చేపట్టి సంతానం కలగాలని కోరుకునే వారికి సంతాన ప్రాప్తి లభిస్తుందని నమ్మిక. గురు ప్రదోష వ్రతం రోజున ఉదయాన్నే ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. సాయంత్రం పూజలు, వ్రతాలను ఆచరిస్తారు. అయితే ఈ రోజున చేసే పూజలు, వ్రతాలకు ఫలితం దక్కాలంటే ప్రదోష వ్రత కథను తప్పక వినాల్సిందే. వ్రత కథను వినకుంటే ఇవాళ చేపట్టే దీక్ష అసంపూర్ణమవుతుందని హైందవులు నమ్ముతారు. గురు ప్రదోష వ్రత కథ ఏంటో తెలుసుకుందాం.

గురు ప్రదోష వ్రతం కథను పఠించండి

ఇతిహాస గ్రంథాల ప్రకారం.. ఒక నగరంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త చనిపోవడంతో ఒక్కతే కాయకష్టం చేసుకుంటూ కొడుకులను పోషించేది. ఉదయాన్నే కొడుకులతో కలిసి భిక్షాటన చేస్తుండేది. ఒక రోజు బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ఆమెకు గాయపడిన స్థితిలో ఒక బాలుడు మూలుగుతూ కనిపించాడు. అతన్ని చూసిన ఆమె జాలిపడి అతన్ని తన ఇంటికి తీసుకువెళ్లింది. అతని గాయాలకు వేసి అతనికి సహాయం చేస్తుంది. ఆ యువకుడు విదర్భ యువరాజు అని తర్వాత బ్రాహ్మణ స్త్రీకి తెలుస్తుంది. శత్రు సైనికులు అతని రాజ్యం మీద దాడి చేసి ఆ యువకుని తండ్రిని బందీగా చేసుకుని రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుసుకుంటుంది. అయినప్పటికీ యువరాజుబ్రాహ్మణ స్త్రీ కుమారుడితో కలిసి ఆమె ఇంట్లోనే జీవిస్తూ ఉంటాడు.

ఒకరోజు అన్షుమతి అనే గంధర్వ యువతీ, రాకుమారుడిని చూసి ముగ్ధురాలైంది. మరుసటి రోజు అన్షుమతి తన తల్లిదండ్రులను తీసుకుని యువరాజును కలవడానికి వచ్చింది. వారికి కూడా యువరాజు నచ్చుతాడు. కొన్ని రోజులకు శివుడు అన్షుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి వారి పెళ్లి చేయాలని ఆదేశిస్తాడు.

బ్రాహ్మణ స్త్రీ శివుడి పరమ భక్తురాలు. ప్రదోష వ్రతం నాడు ఆమె ఉపవాస దీక్ష చేపట్టి పరమేశ్వరుడి పూజిస్తూ ఉండేది. ఫలితంగా అన్షుమతి తండ్రి అయిన గంధర్వ రాజు తన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న విదర్భ మీద దాడి చేసి విజయం సాధిస్తాడు. శత్రువులను తరిమివేసి తిరిగి తన తండ్రితో సంతోషంగా జీవించడం ప్రారంభించాడు. యువరాజు బ్రాహ్మణ కుమారుడిని తన ప్రధానమంత్రిని చేశాడు. అలా పరమేశ్వరుడి పూజా ఫలితం కారణంగా బ్రాహ్మణ స్త్రీ జీవితం ఎలా మలుపు తిరిగిందో అలాగే తన భక్తులందరి జీవితంలో మారతాయని నమ్ముతారు. ఈ ప్రదోష వ్రతం రోజున ఉపవాస దీక్ష చేపడితే కోరిన కోరికలు నెరవేరి అన్నింటా విజయం సాధిస్తారని నమ్ముతారు. అలా ప్రతి ప్రదోష వ్రతం రోజును శివుడి పూజకు అంకితం చేస్తారు.

గురు ప్రదోష వ్రతం రోజున శుభ ముహూర్తం:

హిందూ క్యాలెండర్ ప్రకారం త్రయోదశి తిథి 28 నవంబర్ 2024 ఉదయం 06:23 గంటలకు ప్రారంభమై, 29 నవంబర్ 2024 ఉదయం 08:39 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున శివుడిని పూజించడానికి ఉత్తమ సమయం సాయంత్రం 05.23 నుండి 08.05 వరకు ఉంటుంది. మొత్తం పూజ సమయం 02 గంటల 42 నిమిషాలు.

ప్రదోష వ్రత పూజ యొక్క ఉదయం మరియు సాయంత్రం కొన్ని శుభ ఘడియలున్నాయి. ఈ సమయంలో శుభకార్యాలు చేయడం అత్యంత శుభప్రదమని నమ్ముతారు.

(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడంలేదు. వేరు వేరు వెబ్ సైట్లు, నిపుణుల సలహాల మేరకు వీటిని పొందుపరుస్తున్నాం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించేముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.)

Whats_app_banner