Robert Vadra: వాయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడంపై రాబర్ట్ వాద్రా కీలక కామెంట్స్
19 June 2024, 16:51 IST
కేరళలోని వాయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో రాబర్ట్ వాద్రా తన రాజకీయ ఆకాంక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుందని, కానీ ఇప్పుడే కాదని రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు. ముందుగా, ప్రియాంక రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం తాను ఎదురు చూస్తున్నానన్నారు.
సోదరి ప్రియాంక గాంధీ కుటుంబంతో రాహుల్ గాంధీ
Robert Vadra: కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేయడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో, ప్రియాంక రాజకీయ భవిష్యత్తు, తన క్రియాశీల రాజకీయాల్లోకి తన ప్రవేశం తదితర అంశాలపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రావాలనే ఉంది.. కానీ..
క్రియాశీల రాజకీయాల్లోకి రావాలన్న తన కోరికను ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మరోసారి వ్యక్త పరిచారు. గతంలో పలుమార్లు ఆయన ఈ ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉన్నప్పటికీ.. ప్రియాంక గాంధీ రాజకీయాల్లో స్థిరపడిన తర్వాతే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం గురించి ఆలోచిస్తానని రాబర్ట్ వాద్రా చెప్పారు.
ప్రియాంక ఎంపీ కావాలి..
‘‘క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ముందు ఆమె (ప్రియాంక గాంధీ) ఎంపీ కావాలని కోరుకున్నాను. ఆమె కచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు. పార్లమెంట్ లో ప్రజల నిజమైన సమస్యలను ఆమె లేవనెత్తాలని నేను కోరుకుంటున్నాను. ప్రియాంక తెలివైన మహిళ. నాకంటే ముందు ఆమె పార్లమెంటులో ఉండాలని నేను కోరుకున్నాను’’ అని రాబర్ట్ వాద్రా చెప్పారు.
వాయనాడ్ నుంచి పోటీ
నెహ్రూ-గాంధీ రాజకీయ వంశానికి వారసురాలిగా ఉన్న ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవల తన సోదరుడు రాహుల్ గాంధీ గెలిచిన నియోజకవర్గం నుంచి ఎన్నికల అరంగేట్రం చేయనున్నారు. 52 ఏళ్ల ప్రియాంక దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని వాయనాడ్ లో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బీజేపీకి గుణపాఠం
2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ప్రదర్శన చేయడంపై రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ, ‘‘బీజేపీకి గుణపాఠం నేర్పినందుకు నేను భారత ప్రజలకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు మతం ప్రాతిపదికన రాజకీయాలు చేశారు’’ అన్నారు. అన్ని రకాల మతపరమైన సమస్యలు సృష్టిస్తున్న ఈ విచ్ఛిన్నకర ప్రభుత్వం నిరుద్యోగం, మహిళల భద్రత సమస్య, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘రాహుల్, ప్రియాంక తీవ్రంగా పోరాడారు. ఎక్కడికక్కడ పర్యటించి సంకీర్ణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నేడు మనకు బలమైన ప్రతిపక్షం ఉంది, ప్రజాస్వామ్యాన్ని నిలుపుకోవటానికి దేశానికి అది అవసరం. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను, తమ హోదాను దుర్వినియోగం చేసే ముందు బీజేపీ ప్రభుత్వం ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది’’ అన్నారు.
ప్రియాంకపై ప్రశంసలు
పార్లమెంట్ లో పలు అంశాలను ప్రియాంక గాంధీ లేవనెత్తుతారని రాబర్ట్ వాద్రా తెలిపారు. ‘‘లడ్కీ హూం లాడ్ శక్తి హూం’’ అని ఆమె నినాదమిచ్చారు. ఆమె మహిళల కోసం సుదీర్ఘకాలం పోరాడారు. మహిళల తరఫున పార్లమెంటులో ఆమె గళం విప్పుతారు. బీజేపీ పరివార్ వాద్ మాటలను ప్రజలు ఇక వినడానికి ఇష్టపడరు’’ అని రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు.