Robert Vadra: ‘‘నేను రాజకీయాల్లోకి రావడం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది’’ - రాబర్ట్ వాద్రా-robert vadra once again expresses his desire to join active politics says entire country wants me ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Robert Vadra: ‘‘నేను రాజకీయాల్లోకి రావడం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది’’ - రాబర్ట్ వాద్రా

Robert Vadra: ‘‘నేను రాజకీయాల్లోకి రావడం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది’’ - రాబర్ట్ వాద్రా

HT Telugu Desk HT Telugu
Apr 27, 2024 08:33 PM IST

Robert Vadra: క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గనాలన్న తన కోరికను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మరోసారి బయటపెట్టారు. అమేథీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని తనకు ఉందని గతంలో కూడా వాద్రా బహిరంగంగానే చెప్పారు.

 ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా
ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా (HT_PRINT)

Robert Vadra: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలన్న తన కోరికను ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. తాజాగా, మరోసారి, ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని "దేశమంతా" కోరుకుంటోందని ఆయన చెప్పారు. అమేథీ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ నేత స్మృతి ఇరానీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఆరోపించారు.

దేశమంతా కోరుకుంటోంది..

ప్రత్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయాలని దేశమంతా కోరుకుంటోందని రాబర్ట్ వాద్రా (Robert Vadra) అన్నారు. ‘‘దేశం మొత్తం నుండి వాయిస్ వస్తోంది. నేను ఎప్పుడూ దేశ ప్రజల మధ్య ఉన్నందున నేను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని వారు కోరుకుంటున్నారు. ప్రజలు ఎల్లప్పుడూ నేను వారి ప్రాంతంలో ఉండాలని కోరుకుంటారు. నేను 1999 నుండి అక్కడ (అమేథీ) ప్రచారం చేస్తున్నాను. సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ తన వాగ్దానాలను నెరవేర్చలేదు’’ అని వాద్రా తెలిపారు. అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా వాద్రా ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ముందంజలో ఉంది

లోక్‌సభ ఎన్నికల రెండు దశలు ముగిసిన తర్వాత బీజేపీ కంటే కాంగ్రెస్‌ చాలా ముందంజలో ఉందని రాబర్ట్ వాద్రా అన్నారు. ‘‘ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీని వదిలించుకోవాలని వారు కోరుకుంటున్నారు. రాహుల్ మరియు ప్రియాంక చేస్తున్న కృషిని చూసి భారతదేశ ప్రజలు గాంధీ కుటుంబానికి మద్ధతు ఇస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.

అమేథీ నుంచి పోటీ చేయాలనుంది..

అమేథీ స్థానం నుంచి పోటీ చేయాలని తనకు ఉందని రాబర్ట్ వాద్రా (Robert Vadra)ఈ నెల ప్రారంభంలో కూడా తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘‘అమేథీ ప్రజలు తమ నియోజకవర్గానికి నేను ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారు’’ అని ఆయన అన్నారు. ‘‘గాంధీ కుటుంబ సభ్యుడు తిరిగి రావాలని వారు కోరుకుంటున్నారు. వారు భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారు. నేను రాజకీయాల్లో నా మొదటి అడుగు వేసి, ఎంపీని కావాలని కోరుకుంటే, నేను అమేథీ నుండి ప్రాతినిధ్యం వహించాలని వారు ఆశిస్తున్నారు’’ అని రాబర్ట్ వాద్రా అన్నారు. అయితే, అయితే అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని రాబర్ట్ వాద్రా చెప్పారు.

అమేథీ, రాయ్‌బరేలీ నుంచి ఎవరు?

అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల నుంచి వరుసగా ప్రియాంక గాంధీ వాద్రా (Priynaka Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. వీరు వచ్చే వారం నామినేషన్లు దాఖలు చేయవచ్చని వెల్లడించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి రాహుల్‌ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించారు. ఇప్పుడు కూడా బీజేపీ తరఫున స్మృతి ఇరానీ బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం ప్రకారం, రాష్ట్రంలో కాంగ్రెస్ 17 స్థానాల్లో, సమాజ్‌వాదీ పార్టీ మిగిలిన 63 స్థానాల్లో పోటీ చేయనుంది. అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలకు మే 20న ఐదో దశలో పోలింగ్ జరగనుంది.