Congress Chargesheet : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర - సీఎం రేవంత్ రెడ్డి
Congress Chargesheet On BJP: తెలంగాణకు బీజేపీ చేసిన ద్రోహాల చిట్టా అంటూ కాంగ్రెస్ పార్టీ ఛార్జీషీట్ ను విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను ప్రస్తావించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి…. బీజేపీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Congress Chargesheet On BJP: బీజేపీ పదేండ్ల పాలనలో దేశం సర్వనాశనమైందని ఆరోపించింది తెలంగాణ కాంగ్రెస్(Congress). ‘బీజేపీ నయ వంచన’ పేరుతో ప్రత్యేకంగా ఛార్జీషీట్(Chargesheet) ను విడుదల చేసింది. "పదేండ్ల మోసం - పదేండ్ల విధ్వంసం" అంటూ పలు అంశాలను ప్రస్తావించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reedy) మాట్లాడుతూ… బీజేపీని టార్గెట్ చేశారు. రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు.
రిజర్వేషన్ల రద్దుకు కుట్ర - సీఎం రేవంత్ రెడ్డి
జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reedy). కానీ దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోందని అన్నారు. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని.. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు.. రిజర్వేషన్లు రద్దుకు తోడ్పాటునిస్తుందని కామెంట్స్ చేశారు. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి.. వద్దు అనుకుంటే బీజేపీకి ఓటు వేయాలని అన్నారు. 400 సీట్లు గెలిపించండి అని మోదీ అంటున్నది అందుకే అని చెప్పుకొచ్చారు. బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని గుర్తు చేశారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారన్నారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదని దుయ్యబట్టారు.
“1947 నుండి 2014 వరకు 67 సంవత్సరాలలో 14 ప్రధాన మంత్రులు చేసిన అప్పు రూ.55 లక్షల కోట్లు. 2014 నుండి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు రూ.113 లక్షల కోట్లు. దేశం మీద ఉన్న అప్పుల భారం రూ.168 లక్షల కోట్లు. 14 ప్రధాన మంత్రులు చేసిన అప్పు కంటే నరేంద్ర మోడీ ఒక్కడే రెండింతలు అప్పు చేశాడు. భారతాదేశాన్ని తాకట్టులో పెట్టాడు” అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
మోదీ ప్రయత్నం అదే - భట్టి
డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ…. కొద్దిమందికి దేశ సంపదను కట్టబెట్టేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జనాభాను విభజించి మతకల్లోలాలు సృష్టించేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికితీత, పేదల అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని చెప్పి గత పదేళ్లుగా మోడీ ప్రభుత్వం మోసం చేస్తూ వచ్చిందన్నారు. కొద్దిమంది తన స్నేహితులు, క్రోనీ క్యాపిటలస్ కు దేశ సంపదను కట్టబెట్టేందుకు మోడీ(Narendra Modi) ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తోందన్నారు.
"దేశ సంపదను కొద్దిమందికి కట్టబెట్టాలని చూసే మోడీ ప్రభుత్వం ఓవైపు.. కుల గణన చేసి అధిక శాతం ఉన్న జనాభా కు ఈ దేశ సంపదను పెంచాలని రాహుల్ గాంధీ మరోవైపు ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని, లౌకికవాదం, ఈ దేశ సంపదను కాపాడేందుకు రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. లౌకికవాదం ప్రజాస్వామ్యం ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు మీడియా ముందుకు రావాలి. చార్జ్ షీట్ లో పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి పౌరునికి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ సైన్యం కృషి చేయాలి" అని ఉపముఖ్యమంత్రి భట్టి పిలుపునిచ్చారు.