Priyanka Gandhi: ‘‘అంకుల్ మాటలు పట్టించుకోకండి.. విని నవ్వుకోండి’’ - ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ వ్యంగ్యాస్త్రాలు
ప్రధాని మోదీ కాంగ్రెస్ పై, కాంగ్రెస్ నాయకులపై చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యంగోక్తులతో తిప్పికొట్టారు. మోదీని అంకుల్ అని సంబోధిస్తూ, ‘ఆ అంకుల్ మాటలు పట్టించుకోకండి’ అంటూ ఓటర్లకు సూచించారు. పెళ్లిళ్లలో అర్థంపర్థం లేకుండా మాట్లాడే అంకుల్ లా మోదీ తయారయ్యారన్నారు.
Priyanka Gandhi: లోక్ సభ ఎన్నికల ప్రచారం లో ఇటీవల కాంగ్రెస్ పై, కాంగ్రెస్ నాయకులపై విమర్శల దాడిని ప్రధాని మోదీ మరింత తీవ్రం చేశారు. ఇన్నాళ్లు వారసత్వ రాజకీయాలు, అవినీతి తదితర అంశాలు కేంద్రంగా విమర్శలు చేసే మోదీ (PM Modi).. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సామాన్యుల ఆస్తిపాస్తులను లాక్కుంటుందని ఓటర్లను హెచ్చరించడం ప్రారంభించారు. వారసత్వ పన్ను ను కాంగ్రెస్ తీసుకువస్తుందని హెచ్చరిస్తున్నారు.
మోదీ విమర్శలను తిప్పికొట్టిన ప్రియాంక
సంపద పునఃపంపిణీపై విమర్శలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని (PM Narendra Modi).. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో ఒక మూలన కూర్చుని అర్థంపర్థం లేని మాటలు మాట్లాడే అంకుల్ తో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi). ఆ మాటలు పట్టించుకోవద్దని, అలాంటి హాస్యాస్పద మాటలను విని నవ్వుకోవాలని ఓటర్లకు సూచించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తుంది అని మోదీ అంటున్నారు. ఈ అర్థం లేని మాటలు విన్న తరువాత.. ఏం చేయాలి.. కాసేపు నవ్వుకోవాలి’’ అని ప్రియాంక వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నారు..
‘‘ప్రధాని హోదాలో ఉన్నాను కాబట్టి.. నేను ఏం మాట్లాడినా.. ఎంత అర్థంపర్థం లేకుండా మాట్లాడినా ప్రజలు నమ్ముతారని ప్రధాని మోదీ భావిస్తున్నారు’’ అని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) విమర్శించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎక్స్ రే యంత్రంతో ప్రజల ఇళ్లలోకి ప్రవేశించి సోదాలు చేస్తుందని, ఆ తర్వాత మీ నగలతో పాటు భద్రపరిచిన మంగళసూత్రాన్ని కూడా లాక్కుని ఇతరులకు ఇస్తుందని ప్రధాని ప్రజలను హెచ్చరిస్తున్నారు. అది సాధ్యమేనా? అంత అర్థం లేకుండా ఎవరైనా మాట్లాడుతారా? ఓటమి భయంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారా?’’ అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరగడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన ఖరీదైన మనిషి’’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) శనివారం గుజరాత్ లో లోక్ సభ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.