Lok sabha elections 2024: 'హనుమాన్ చాలీసా వినడం నేరమా?': కర్నాటక ఘటనను గుర్తు చేసిన ప్రధాని మోదీ
Lok sabha elections 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విస్తృతంగా పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ పై, కాంగ్రెస్ నేతలపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ బుధవారం పాల్గొన్నారు.
Lok sabha elections 2024: రెండో దశ పోలింగ్ లో 13 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న రాజస్తాన్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నాటకలో ఇటీవల జరిగిన ఒక ఘటనను ప్రస్తావించారు. హనుమాన్ చాలీసా వింటున్న దుకాణదారుడిపై కొందరు దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో హిందూ దేవుడిని పూజించడం 'నేరం'గా మారిందని ప్రధాని (PM Modi) విమర్శించారు.
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
బీజేపీ పాలిత రాజస్తాన్ లోని టోంక్-సవాయ్ మాధోపూర్ లోక్ సభ నియోజక వర్గంలో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ‘‘రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాది శ్రీరామనవమి రోజున రాజస్తాన్ లో శోభాయాత్ర నిర్వహించారు. ప్రజలు ఒకరినొకరు 'రామ్.. రామ్' అని పలకరించుకునే రాష్ట్రంలో, రామనవమి రోజున ఊరేగింపులు, వేడుకలను కాంగ్రెస్ నిషేధించింది’’ అని మోదీ (PM Modi) విమర్శించారు. 'మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, మద్దతు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా చుట్టూ ఉన్న ఉత్సాహభరితమైన ముఖాలను చూసి నేను సంతోషిస్తున్నాను. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని మోదీ (PM Modi) పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో..
కర్నాటక (karnataka) ఘటనను ప్రస్తావిస్తూ, శ్రీరామనవమి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నప్పుడు, కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన తనకు గుర్తుకు వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్ పాలిత కర్నాటకలో హనుమాన్ చాలీసా పారాయణం వింటున్నందుకు ఓ దుకాణదారుడిపై దారుణంగా దాడి చేశారు. ఈ ఏడాది మార్చిలో 'ఆజాన్' (ప్రార్థనకు ముస్లిం పిలుపు) సమయంలో ఆడియో సిస్టమ్ లో 'హనుమాన్ చాలీసా' ప్లే చేస్తున్న ఒక దుకాణదారుడితో కొందరు యువకులు వాగ్వాదానికి దిగి, దాడి చేశారు.
రాజస్తాన్ లో బీజేపీ పాలనలోనే ఘనంగా నవమి వేడుకలు
కాంగ్రెస్ తన పాలనలో రాజస్థాన్ లో శ్రీరామనవమి (sri rama navami) వేడుకలను నిలిపివేసిందని, కాంగ్రెస్ పాలనలో నిర్భయంగా తమ మత ఆచారాలను పాటించడం కష్టం అవుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన తర్వాత తొలిసారిగా ఇక్కడి ప్రజలు శ్రీరామనవమి రోజున ఊరేగింపు నిర్వహించి వేడుకలు జరుపుకున్నారు. కాంగ్రెస్ హయాంలో రాజస్థాన్ లో శ్రీరామ నవమి వేడుకలపై అప్రకటిత నిషేధం విధించారు. నవమి వేడుకుల్లో పాల్గొనే వారిపై రాళ్లు రువ్వేవారికి ఆ రాష్ట్రం రక్షణ కల్పించింది’’ అని మోదీ ఆరోపించారు.
రెండో విడతలో పోలింగ్
ఈ సందర్భంగా రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మపై ప్రధాని మోదీ (PM Modi) ప్రశంసలు కురిపించరు. ఒకప్పుడు రాష్ట్రంలో చక్రం తిప్పిన మాఫియా, క్రిమినల్స్ ఇప్పుడు ప్రస్తుత పాలనలో పరారీలో ఉన్నారని మోదీ తెలిపారు. 'మీరు కొన్ని నెలల క్రితమే కాంగ్రెస్ బారి నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన గాయాలు ఎప్పటికీ మరిచిపోలేనివి. మహిళలపై అఘాయిత్యాల విషయంలో రాజస్థాన్ ను అగ్రస్థానంలో నిలిపారు. టోంక్ లోని పరిశ్రమలు ఎందుకు మూతపడ్డాయో మీ అందరికీ తెలుసు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాఫియా, క్రిమినల్స్ పరారీలో ఉన్నారు' అని ప్రధాని మోదీ అన్నారు.