Priyanka Gandhi: ‘‘మంగళసూత్రం’’ వ్యాఖ్యలపై ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్
Priyanka Gandhi: ఎన్నికల రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం తీవ్రమైన విమర్శలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా తిప్పికొట్టారు.
Priyanka Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజల నుంచి ఆస్తి పాస్తులను లాగేసుకుంటుందని, మహిళల మంగళసూత్రాలను కూడా వదలదని ఇటీవల ప్రధాని మోదీ ఒక ఎన్నికల ప్రచార సభలో ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారి, దారుణమైన అవాస్తవాలు మాట్లాడడం దారుణమని విమర్శించారు.
దేశం కోసం మంగళసూత్రాలు త్యాగం చేసిన సోనియా
తాజాగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. తన తల్లి సోనియాగాంధీ దేశం కోసం మంగళసూత్రాన్ని త్యాగం చేశారని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
మంగళసూత్రం విలువ మోదీకి తెలియదు..
‘‘ఈ దేశంలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ మీ 'మంగళసూత్రం' లాక్కోవాలనుకుంటోందని రెండు రోజుల క్రితం స్వయంగా ప్రధాని అన్నారు. గత 75 ఏళ్లుగా ఈ దేశం స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ఉంది. అందులో 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏనాడైనా మీ బంగారం లేదా మంగళసూత్రాన్ని కాంగ్రెస్ లాక్కుందా? ’’ అని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ప్రశ్నించారు. గతంలో యుద్ధం వచ్చినప్పుడు తన నానమ్మ (మాజీ ప్రధాని ఇందిరాగాంధీ) తన మొత్తం బంగారాన్ని విరాళంగా ఇచ్చిన విషయాన్ని ప్రియాంక గుర్తు చేశారు. మంగళసూత్రం ప్రాముఖ్యతను నరేంద్ర మోదీ అర్థం చేసుకుని ఉంటే ఇలాంటి అనైతిక విషయాలు మాట్లాడేవారు కాదని ప్రియాంక విమర్శించారు.
మహిళలు ఆకలితో నిద్రపోతారే కానీ..
కుటుంబంలో అందరూ నిద్రపోయే వరకు మహిళలు నిద్రపోరని, కుటుంబంలో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మహిళలు తమ నగలను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉంటారని ప్రియాంక గాంధీ అన్నారు. ‘‘మహిళలు ఇతరులను ఖాళీ కడుపుతో నిద్రపోనివ్వడం కంటే.. తామే ఆకలితో నిద్రపోవడానికి ఇష్టపడతారు. వీళ్లకు (బీజేపీకి) ఆమె పోరాటం తెలియదు. రైతు అప్పుల్లో ఉన్నప్పుడు అతని భార్య తన మంగళసూత్రాన్ని తాకట్టు పెడుతుంది. కుమార్తె వివాహం లేదా కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, మహిళ తన నగలను తాకట్టు పెడుతుంది’’ అని ప్రియాంక గాంధీ మహిళల గొప్పదనాన్ని వివరించారు.
ప్రధాని మోదీ విమర్శలు
‘‘తమ పార్టీ అధికారంలోకి వస్తే సామాన్యుల వద్ద ఉన్నవన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఇతరులకు పంచుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఇది తమ మేనిఫెస్టోలో ఉందని ఆయన అంటున్నారు. మన కుటుంబాల్లోని మహిళలు బంగారు ఆభరణాలను కలిగి ఉంటారు. బంగారం కలిగి ఉండడం స్త్రీ ధనంగా వారికి ఉన్న చట్టబద్ధమైన హక్కు’’ అని మోదీ సోమవారం అలీగఢ్ లో జరిగిన ర్యాలీలో వ్యాఖ్యానించారు. ‘‘మా తల్లులు, అక్కచెల్లెళ్ల నుంచి మంగళసూత్రం సహా బంగారాన్ని లాక్కోవడానికి చట్టాన్ని సవరించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. వారి బంగారాన్ని లాక్కునేందుకు కుట్ర పన్నుతోంది’’ అని మోదీ ఆరోపించారు.