TPCC : తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలి - టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం-tpcc has invited former aicc chief sonia gandhi to contest from telangana ahead of lok sabha polls 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tpcc : తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలి - టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం

TPCC : తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలి - టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 04, 2024 08:08 AM IST

Telangana Congress Latest News: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని టీపీసీసీ తీర్మానం చేసింది. బుధవారం జరిగిన టీపీసీసీ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… వచ్చే ఎన్నికల్లో 12 సీట్లకు తగ్గకుండా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు.

టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం

Telangana Pradesh Congress Committee: టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఇందిరా భవన్ లో అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో…. మూడు తీర్మానాలను ప్రతిపాదించారు. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ ఒక తీర్మానం చేయగా… తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్ రావు ఠాక్రే అభినందిస్తూ రెండవ తీర్మానం చేసినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు.

ధీటుగా తిప్పికొట్టాలి - సీఎం రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి… ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని చెప్పారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదన్నారు. బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్ పార్టీకి బుద్ది రాలేదని… నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని దుయ్యబట్టారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుందని విమర్శించారు. బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

12కు తగ్గొద్దు…

టార్గెట్ 17 పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 12 సీట్లకు తగ్గకుండా లోక్ సభ స్థానాలను గెలిపించుకోవాలన్నారు. ఈ నెల 8న 5జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిస్తామని చెప్పారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జ్ లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్న ఆయన… 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని పేర్కొన్నారు.

కాళేశ్వరంపై బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుందంటూ సెటైర్లు విసిరారు. అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారని అన్నారు. ఆనాడు స్వయంగా తాను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారని నిలదీశారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారని… కాళేశ్వరం అవినీతిపై జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలన్న రేవంత్ రెడ్డి.. ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.

Whats_app_banner