Hyderabad News : తెలంగాణలో ఏరో స్పేస్ పార్కు, డేటా సెంటర్- సీఎం రేవంత్ రెడ్డితో అదానీ ప్రతినిధులు చర్చలు-hyderabad news in telugu cm revanth reddy adani representative meeting discussed investments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad News : తెలంగాణలో ఏరో స్పేస్ పార్కు, డేటా సెంటర్- సీఎం రేవంత్ రెడ్డితో అదానీ ప్రతినిధులు చర్చలు

Hyderabad News : తెలంగాణలో ఏరో స్పేస్ పార్కు, డేటా సెంటర్- సీఎం రేవంత్ రెడ్డితో అదానీ ప్రతినిధులు చర్చలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 03, 2024 06:54 PM IST

Hyderabad News : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డితో అదానీ ప్రతినిధులు భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో అదానీ ప్రతినిధులు భేటీ

Hyderabad News : తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోమారు ముందుకు వచ్చింది. బుధవారం సెక్రెటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో పోర్ట్స్- సెజ్ సీఈవో, గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరో స్పేస్ సీఈవో ఆశీష్ రాజ్ వన్షీలతో చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు నిలబడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసిమ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో అమర్ రాజా పెట్టుబడులు

తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో గల్లా జయదేవ్ చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలపై సమావేశంలో చర్చించారు.

అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ భారతదేశంలోని ప్రముఖ ఎనర్జీ స్టోరేజ్ మరియు మొబిలిటీ ఎంటర్‌ప్రైజ్‌లో ఒకటి. పారిశ్రామిక, ఆటోమోటివ్స్ రంగంలో ఉపయోగించే బ్యాటరీల తయారీదారులలో అతిపెద్ద కంపెనీ. పెరుగుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్‌కు అనుగుణంగా అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా ఒక గిగా కారిడార్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే పెద్దదైన అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC), లిథియం-అయాన్ బ్యాటరీ తయరీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పుతోంది. తెలంగాణ న్యూ ఎనర్జీ పార్క్, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లింగ్ యూనిట్, శంషాబాద్‌లోని ఇ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ పేరుతో రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ హబ్ ను ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.9,500 కోట్ల పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో దాదాపు 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దాదాపు అదే సంఖ్యలో పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

IPL_Entry_Point