BRS Party : ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ ఫోకస్ - గులాబీ బాస్ కేసీఆర్ కీలక ఆదేశాలు-brs party has finalized the preparatory meetings for the parliament elections 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Party : ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ ఫోకస్ - గులాబీ బాస్ కేసీఆర్ కీలక ఆదేశాలు

BRS Party : ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ ఫోకస్ - గులాబీ బాస్ కేసీఆర్ కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 29, 2023 04:34 PM IST

Lok Sabha Elections 2024 Updates: లోక్ సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్దమయ్యే పనిలో పడింది. వచ్చే నెల మూడు నుంచి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు జరగనున్నట్లు ప్రకటన చేసింది.

లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్
లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్

Lok Sabha Elections 2024 Updates: జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలను నిర్వహించబోతుంది. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో మాట్లాడుతున్న పార్టీ పెద్దలు… ఇకపై పార్లమెంట్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సమయత్తమవుతుంది. ఇందులో భాగంగా జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, , పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీశ్, కడియం, పోచారం, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.

రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో... మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది. మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.

వివరాలు ఇలా ఉన్నాయి..

• 3న ఆదిలాబాద్

• 4న కరీంనగర్

• 5న చేవెళ్ల

• 6న పెద్దపల్లి

• 7న నిజామాబాద్

• 8న జహీరాబాద్

• 9న ఖమ్మం

• 10న వరంగల్,

• 11న మహబూబాబాద్

• 12న భువనగిరి

సంక్రాంతి అనంతరం..

• 16న నల్గొండ

• 17న నాగర్ కర్నూలు

• 18న మహబూబ్ నగర్

• 19న మెదక్

• 20న మల్కాజ్ గిరి

• 21 సికింద్రాబాద్ మరియు హైదరాబాద్

ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లా పార్టీ అద్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు.

తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

Whats_app_banner