BRS Party : కలిసికట్టుగా పనిచేద్దాం.. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేద్దాం - కేటీఆర్
KTR with BRS Hyderabad Corporators: హైదరాబాద్ నగర బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
KTR with BRS Hyderabad Corporators: జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో భారత రాష్ట్ర సమితికి అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన కార్పొరేటర్లకు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సమావేశమైన కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు.
హైదరాబాద్ నగరంలో భారత రాష్ట్ర సమితి పటిష్టంగా ఉందని చెప్పారు కేటీఆర్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల నుంచి నిరాశపడకుండా ప్రజల తరఫున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్రను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని అయితే హామీలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ చెప్పారు.
జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ నగర అభివృద్ధి కోసం ఎప్పటిలానే నిరంతరంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.