Priyanka Gandhi: ప్రియాంక గాంధీ కి స్వల్ప అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స
Priyanka Gandhi hospitalised: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్వల్ప అనారోగ్యం కారణంగా తాను ఆసుపత్రిలో చేరానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా వెల్లడించారు. అందువల్ల శుక్రవారం ఉత్తర ప్రదేశ్ లో అడుగుపెట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనడం లేదని వివరణ ఇచ్చారు.
రాహుల్ కు శుభాకాంక్షలు
భారత్ జోడో న్యాయ యాత్ర యూపీలో కొనసాగుతున్న నేపథ్యంలో.. తన సోదరుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలకు ప్రియాంక గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యం బాగైన వెంటనే యాత్రలో పాలుపంచుకుంటానని చెప్పారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తర్ ప్రదేశ్ లోకి ప్రవేశించనుంది. బిహార్ నుంచి ఈ యాత్ర ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ లోని చందౌలిలో తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఈ యాత్రలో పాలు పంచుకోవాల్సి ఉండగా, అనారోగ్యం కారణంగా, ఆమె అక్కడకు వెళ్లడం లేదు.
ట్విటర్ పోస్ట్
‘‘ఉత్తర ప్రదేశ్ లోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర చేరుకోవడం కోసం ఆతృతగా ఎదురుచూశాను. కానీ అనారోగ్యం కారణంగా ఈ రోజే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నాకు ఆరోగ్యం కుదుటపడగానే యాత్రలో పాల్గొంటాను’’ అని ప్రియాంక గాంధీ ప్రకటించారు. ‘‘అప్పటి వరకు, చందౌలి-బనారస్ చేరుకునే భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటున్న అందరికీ, నా ప్రియమైన సోదరుడికి, ఉత్తర ప్రదేశ్ లోని నా సహ కార్యకర్తలందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని వాద్రా ఎక్స్ లో హిందీలో ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.
బిహార్ నుంచి యూపీలోకి..
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర శుక్రవారం సాయంత్రం బీహార్ నుంచి ఉత్తర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. గురువారం బీహార్ లోని ఔరంగాబాద్ లో జరిగిన మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. లోక్ సభకు అత్యధిక ఎంపీలను పంపే కీలక హిందీ రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో శుక్రవారం సాయంత్రం యాత్ర జరగనుంది. ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు, ఆ తర్వాత ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగుతుంది. యాత్రకు ఫిబ్రవరి 22, 23 తేదీల్లో విరామం ఉంటుందని కాంగ్రెస్ పేర్కొంది. ఈ భారత్ జోడో న్యాయ యాత్ర 15 రాష్ట్రాల గుండా 6,700 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.