Robert Vadra: అమేథీ నుంచి రాబర్ట్ వాద్రా పోటీ చేస్తున్నారా?.. కాంగ్రెస్ టికెట్ పైనేనా? లేక..?
Robert Vadra: ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న తన అభిలాషను గతంలో పలుమార్లు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా, మరోసారి అమేథీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలన్న కోరికను ఆయన వ్యక్తపరిచారు.
Lok sabha elections 2024: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections 2024) ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న కోరికను మరోసారి వ్యక్తపర్చారు. అమేథీ మొదటి నుంచి గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం. కానీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.
చాలా ఆఫర్స్ వస్తున్నాయి..
కాగా, ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తాజాగా మరోసారి రాబర్ట్ వాద్రా (Robert Vadra) సంకేతాలిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో(lok sabha elections 2024) పోటీ చేసేందుకు తనకు ఇతర పార్టీల నుంచి అనేక ఆఫర్లు వస్తున్నాయని, ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు తనకు హామీ కూడా ఇచ్చారని వాద్రా చెప్పారు. తాను పార్లమెంటు సభ్యుడిని కావాలని భావిస్తే అమేథీ ప్రజలు కచ్చితంగా తనను ఆశీర్వదిస్తారని భావిస్తున్నానని రాబర్ట్ వాద్రా అన్నారు.
అమేథీ నుంచేనా?.. కాంగ్రెస్ తరఫునేనా..?
ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, గత కొన్ని సంవత్సరాలుగా రాబర్ట్ వాద్రా (Robert Vadra) కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగానే ఉంటున్నారు. 2019 లో తన బావమరిది రాహుల్ గాంధీ తరఫున ప్రచారం కూడా చేశారు. 2019లో అమేథీలో కాంగ్రెస్ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య అమేథీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను చాలా కాలంగా ఇక్కడి ప్రజలను కలుస్తున్నాను. ఇతర పార్టీలకు చెందిన ఎంపీలను కలిసినప్పుడు.. వారు వారి పార్టీ నుండి పార్లమెంటుకు రావాలని ఆఫర్ చేశారు. మీరు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు? మీరు భారీ మెజారిటీతో గెలిచేలా చూస్తాము అని వారు హామీ కూడా ఇచ్చారు’’ అని వాద్రా వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని గెలిపించి తాము తప్పు చేశామని అమేథీ ప్రజలు భావిస్తున్నారని, ఆమె అమేథీని విస్మరించారని ఆయన విమర్శించారు.
రాబర్ట్ వాద్రా వివరాలు..
- సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra). రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినా 2019 లోక్ సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆయన ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు.
- వాద్రా 1997లో ఆర్టెక్స్ అనే వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆయన కంపెనీ మొదట్లో హస్తకళల సంస్థగా ఉన్నప్పటికీ చార్టర్ ఎయిర్ క్రాఫ్ట్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వంటి పలు రంగాల్లోకి విస్తరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డీఎల్ఎఫ్ గ్రూప్ ఆయన భాగస్వామి.
- రాజకీయాల్లో వాద్రా ఇప్పటివరకు ఎప్పుడూ బ్యాక్ గ్రౌండ్ లోనే ఉన్నారు. కానీ 2012 తర్వాత, అన్నాహజారే నేతృత్వంలో భారతదేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైన సమయంలో ఆయన ప్రతిపక్ష పార్టీలకు టార్గెట్ అయ్యారు.
- రూ.65 కోట్ల వడ్డీలేని రుణం తీసుకున్నారని, అలాగే రాజకీయ ప్రయోజనాలకు బదులుగా డీఎల్ఎఫ్ గ్రూప్ నుంచి భారీ భూ బేరసారాలు చేశారని 2011లో వాద్రాపై అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు.
- బికనీర్ లోని కొలాయత్ ప్రాంతంలో 2015లో జరిగిన అక్రమ భూ లావాదేవీల కేసులో రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి మౌరీన్ కు రాజస్థాన్ హైకోర్టు 2019లో సమన్లు జారీ చేసింది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ రాజస్థాన్ ప్రభుత్వంతో కుమ్మక్కై 69 ఎకరాల భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించిందని ఆరోపిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది.