Sonia Gandhi assets: సోనియా గాంధీ ఆస్తుల విలువ 12 కోట్ల రూపాయలు; కారు లేదు
Sonia Gandhi assets: రాజస్తాన్ నుంచి రాజ్య సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ.. తన స్థిర, చరాస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో రిటర్నింగ్ అధికారికి వెల్లడించారు. తనకు రూ. 12 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఆమె తెలిపారు.
Sonia Gandhi assets: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.12.53 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఇటలీలో తన తండ్రికి చెందిన రూ.27 లక్షల విలువైన ఆస్తిలో సోనియా గాంధీకి వాటా ఉంది. వీటితో పాటు 88 కిలోల వెండి, 1,267 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నాయి. ఢిల్లీలోని డేరా మండి గ్రామంలో సోనియా గాంధీకి మూడు బిగాల వ్యవసాయ భూమి ఉంది. ఎంపీ గా వచ్చే వేతనం, రాయల్టీ ఆదాయం, మూలధన లాభాలు తదితరాలను ఆమె ఆదాయంగా పేర్కొన్నారు.
90 వేల నగదు మాత్రమే.., కారు లేదు
తన వద్ద రూ.90 వేల నగదు ఉందని సోనియా గాంధీ తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో తనకు మొత్తం రూ. 11.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా సొంత కారు లేదని సోనియా గాంధీ వెల్లడించారు. అలాగే, సోషల్ మీడియాలో తనకు ఖాతా లేదని తెలిపారు.
సోనియా గాంధీ విద్యార్హత
రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్ లో తన విద్యార్హతల వివరాలను కూడా సోనియా గాంధీ (Sonia Gandhi) వెల్లడించారు. సియానాలోని ఇస్టిటుటో శాంటా థెరిసా నుంచి ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో మూడేళ్ల విదేశీ భాషల కోర్సును 1964 లో పూర్తి చేశానని ఆమె తెలిపారు. అలాగే, 1965లో కేంబ్రిడ్జ్ లోని లెన్నాక్స్ కుక్ స్కూల్ నుంచి ఇంగ్లిష్ లో సర్టిఫికేట్ కోర్సు చేశానని తెలిపారు.
లోక్ సభ ఎన్నికలకు నో..
ఇకపై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న కీలక నిర్ణయాన్ని సోనియాగాంధీ తీసుకున్నారు. అందువల్ల, ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. గత ఐదు దఫాలుగా తాను ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నియోజకవర్గ ప్రజలకు రాసిన లేఖలో రాయ్ బరేలీ ప్రజలు లేకుండా ఢిల్లీలో తన కుటుంబం అసంపూర్ణంగా ఉందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ‘‘స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో మా మామ ఫిరోజ్ గాంధీని ఎన్నుకుని మీ ప్రతినిధిగా ఢిల్లీకి పంపారు. ఆ తర్వాత మా అత్తగారు ఇందిరాగాంధీని మీ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా మన మధ్య అనుబంధం కొనసాగింది. మీ పట్ల మా అంకితభావం బలపడింది’’ అని సోనియా గాంధీ ఆ లేఖలో పేర్కొన్నారు, తన వయస్సు, అనారోగ్య సమస్యల కారణంగా ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు.
బీజేపీ విమర్శలు
సోనియా గాంధీ నామినేషన్ పత్రంలో ఆమె తన స్థిరాస్తులను పూర్తిగా వెల్లడించలేదని బిజెపి ఫిర్యాదు చేసింది. ఇటలీలో తన ఆస్తి వాటా వివరాలను సోనియాగాంధీ స్పష్టంగా పేర్కొనలేదని బీజేపీ నేత యోగేంద్ర సింగ్ తన్వర్ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు.