Sonia Gandhi: ‘‘రాజీవ్ రాజకీయ జీవితం చాలా అర్ధాంతరంగా, దారుణంగా ముగిసింది’’: సోనియా గాంధీ ఆవేదన
Sonia Gandhi: తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అర్ధాంతరంగా, చాలా దారుణంగా ముగిసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిగా కొద్ది కాలమే ఉన్నప్పటికీ అద్భుతమైన విజయాలను సాధించారని భర్త రాజీవ్ గాంధీని ఆమె కొనియాడారు.
Sonia Gandhi: తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అర్ధాంతరంగా, చాలా దారుణంగా ముగిసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిగా కొద్ది కాలమే ఉన్నప్పటికీ అద్భుతమైన విజయాలను సాధించారని భర్త రాజీవ్ గాంధీని ఆమె కొనియాడారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జవహర్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
చిన్న వయస్సులోనే ప్రధానిగా బాధ్యతలు
రాజీవ్ గాంధీ అత్యంత పిన్న వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. తన తల్లి ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో 40 ఏళ్ల చిన్న వయసులో రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రధానిగా 1989 డిసెంబర్ వరకు ఉన్నారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. 1991లో తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ సూసైడ్ బాంబర్ పొట్టన పెట్టుకున్నారు. ఆ ఆత్మహుతి దళ సభ్యురాలు రాజీవ్ గాంధీకి అత్యంత సమీపం నుంచి తనను తాను పేల్చుకుని రాజీవ్ గాంధీ ప్రాణాలు తీశారు.
రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డు
ఆగస్టు 20 రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డును మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ రాజస్థాన్ కు చెందిన బనస్థలి విద్యాపీఠ్ కు అందించారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోనియా గాంధీ తన భర్త రాజీవ్ గాంధీ ప్రధానిగా సాధించిన విజయాలను గుర్తు చేశారు. మహిళల సాధికారత పట్ల రాజీవ్ గాంధీకి ఎంతో ఆసక్తి ఉండేదని తెలిపారు. రాజీవ్ గాంధీ హయాంలోనే పంచాయతీల్లో 33% రిజర్వేషన్లు మహిళలకు లభించాయని, ఆ చట్టం కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళలు గ్రామపంచాయతీల్లో మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారన్నారు. అలాగే రాజీవ్ గాంధీ హయాంలోనే ఓటింగ్ వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
నేటి పాలకుల విద్వేషం
దేశ విభిన్నతను రాజీవ్ గాంధీ ఎంతో గౌరవించే వారిని, భారతదేశ ఆత్మ దేశ విభిన్నత, వైవిధ్యతలోనే ఉందని అనేవారని ఆమె చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారి అండతో దేశంలో విద్వేషం, మతపరమైన వివక్ష రాజ్యమేలుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ సమయంలో రాజీవ్ గాంధీ చెప్పిన సద్భావన మౌలిక సూత్రాలను సమాజం అనుసరించాల్సి ఉందని ఆమె పిలుపునిచ్చారు. మత, జాతి, భాష, సాంస్కృతిక పరగా దేశంలో ఉన్న వైవిధ్యతను గౌరవించడం ద్వారానే దేశ ఐక్యత మనుగడ సాగిస్తుందని ఆమె అన్నారు. 25వ రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డు ను రాజస్థాన్ కు చెందిన బనస్థలి విద్యా పీఠ్ తరపున ఆ సంస్థ ప్రతినిధి సిద్ధార్థ శాస్త్రి అందుకున్నారు.