Brain-eating amoeba: మెదడును తినేసే అరుదైన అమీబా కారణంగా 12 ఏళ్ల బాలుడి మృతి
05 July 2024, 14:09 IST
Brain-eating amoeba: కేరళలోని కోజికోడ్ జిల్లాలో బుధవారం రాత్రి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ఇన్ఫెక్షన్ తో 12 ఏళ్ల బాలుడు మరణించాడని, గత రెండు నెలల్లో ఇది మూడవ మరణం అని కేరళ ఆరోగ్య అధికారులు తెలిపారు.
మెదడును తినే అరుదైన అమీబా కారణంగా 12 ఏళ్ల బాలుడి మృతి
Brain-eating amoeba: కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఒక బాలుడు అరుదైన వ్యాధితో మరణించాడు. మెదడును తినేసే ఒక అరుదైన అమీబా కారణంగా 12 ఏళ్ల ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అంటారని వైద్యులు తెలిపారు. ఈ అమీబా కారణంగా గత రెండు నెలల్లో చోటు చేసుకున్న మూడవ మరణం ఇదని ఆరోగ్య అధికారులు తెలిపారు.
చికిత్స పొందుతూ మృతి
కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫెరోక్ కు చెందిన 12 ఏళ్ల బాలుడు మృదుల్ ఈపీ మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న ఈ బాలుడికి తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపించడంతో జూన్ 24న ఆసుపత్రిలో చేర్పించారు. తన ఇంటి సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేసిన తర్వాత బాలుడికి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానిస్తున్నారు.
చెరువులు, సరస్సుల్లో..
చెరువులు, సరస్సులు వంటి మంచినీటి వనరులలో కనిపించే అమీబా జాతి నైగ్లేరియా ఫౌలెరి వల్ల ఈ ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. మనిషి ముక్కు ద్వారా ఈ అమీబా మానవ వ్యవస్థలోకి ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది మెదడులోని కణాలను ఆహారంగా తీసుకుంటుంది. దాంతో, స్వల్ప కాలంలోనే విస్తృతమైన కణజాల నష్టం జరిగి నెక్రోసిస్ కు దారితీస్తుంది. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ 90% మరణాల రేటును కలిగి ఉంది. ఇది అరుదైన ఇన్ఫెక్షన్ అయినప్పటికీ, ఇది నిర్ధారణ అయిన తర్వాత ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తుంది. దీనికి ప్రధానంగా యాంటీమైక్రోబయల్ థెరపీ చికిత్స అందిస్తారు.
చికిత్స అందించినా ఫలితం శూన్యం
మృదుల్ ను రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించి, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించి నిరంతరం పర్యవేక్షించి యాంటీమైక్రోబయల్ చికిత్స అందించారు. అయితే ఆ బాలుడి పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మృదుల్ స్నానం చేసిన చెరువులోకి ఎవరూ వెళ్లకుండా రామనాటుకర మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
మూడో మరణం
కేరళ రాష్ట్రంలో మే నెల నుంచి ఈ ప్రాణాంతక అమీబా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన మూడో వ్యక్తి ఈ మృదుల్. గతంలో కన్నూర్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలిక జూన్ 25న, మలప్పురంకు చెందిన ఐదేళ్ల బాలిక మే 21న మృతి చెందారు. మూడు మరణాల నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేస్తున్నామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ప్రభుత్వ సీనియర్ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. మృదుల్ మాదిరిగానే అదే చెరువులో స్నానం చేసిన ఇతర పిల్లలు, వారిలో ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయా అని పరీక్షించామని, అయితే ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదని తెలిపారు.
భయం అక్కర్లేదు..
ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు తెలిపారు. "ఇది చాలా అరుదైన సంక్రమణ కాబట్టి వారు చెరువులు లేదా సరస్సులను ఉపయోగించకుండా ఉండాల్సిన అవసరం లేదు. చెరువులు, సరస్సుల్లో అమీబా జాతుల ఉనికిని తనిఖీ చేయడానికి మేము వివిధ నీటి వనరుల నుండి నమూనాలను పరీక్షిస్తాము. రుతుపవనాలు బలపడి వర్షాలు కురుస్తుండటంతో ఈ వనరుల్లోని నీరు మరింత పలుచబడి అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు తగ్గుతాయి’’ అని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.