Winter Skincare Tips । శీతాకాలంలో మాయిశ్చరైజర్ సరిపోదు, అంతకుమించి కావాలి?!
03 November 2022, 15:57 IST
- Winter Skincare Tips: నవంబర్ 3 నుంచి చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. చలి పెరిగితే సమస్యలు పెరుగుతాయి. శీతాకాలంలో చర్మ సంరక్షణకు మామూలుగా కాకుండా అంతకుమించి సంరక్షణ తీసుకోవాలి, అందుకు చిట్కాలు చూడండి.
Winter Skincare Tips
Winter Skincare Tips: చలికాలం మొదలైంది, రోజులు గడిచేకొద్దీ చలితీవ్రత మెల్లిమెల్లిగా పెరుగుతూపోతుంది. మారుతున్న వాతావరణం, ఆపై కాలుష్యం ఈ రెండూ మన శరీరంపై ప్రభావం చూపిస్తాయి. ఈ చలికాలంలో చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన దుస్తులు, ఆహారం, అలవాట్లు మొదలైన అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చల్లని వాతావరణంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఇది దురద, ఇతర అలర్జీలకు దారితీస్తుంది. అలాగే చర్మం, పెదవులు, బుగ్గలు ఇంకా పాదాల పగుళ్లు కలుగుతాయి. ఇటువంటి సందర్భాలలో కేవలం చర్మానికి మాయిశ్చరైజర్ సరిపోదు, అంతకు మించి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. చర్మానికి బయటి నుంచే కాకుండా, లోపలి నుంచి కూడా సంరక్షణ అందివ్వాలి.
ముఖ్యంగా ఈ సీజన్‌లో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ఈ కాలంలో దాహం ఎక్కువగా వేయదు, అయితే అడపాదడపా నీరు తాగడం మరిచిపోవద్దు. నీరు సమృద్ధిగా తాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. కాలానికి అనుగుణంగా తినే ఆహారం, జీవనశైలిలో కూడా మార్పులు, చేర్పులు చేసుకోవాలి.
Winter Skincare Tips- శీతాకాలం చర్మ సంరక్షణ
చలికాలంలో చర్మ సమస్యలు రాకుండా, చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి పాటించాల్సిన మరిన్ని హోం రెమెడీస్ ఏమున్నాయో, ఇప్పుడు చూద్దాం.
కొబ్బరి నూనెతో మసాజ్
కేవలం పైపైన పూయకుండా, కొబ్బరి నూనెతో చర్మాన్ని మసాజ్ చేయండి. కొబ్బరి నూనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జిగట, కొబ్బరి కొవ్వును కలిగి ఉంటుంది. చలికాలంలో కొబ్బరినూనె చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు అర చెంచా నూనెను రెండు చేతులకు రాసి రెండు నిమిషాల పాటు మీ చేతులు, కాళ్లను మసాజ్ చేయండి. ఉదయాన్నే లేచి స్నానం చేయండి.
చర్మానికి తేనెను అప్లై చేయండి
తేనె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా చర్మ సమస్యలను దూరం చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది చర్మంపై సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చేతులు, కాళ్లకు తేనె రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి కడిగేసుకుంటే చర్మం తేమగా ఉంటుంది.
పెట్రోలియం జెల్లీ మసాజ్
పెట్రోలియం జెల్లీ చర్మంపై ఔషధంలా పనిచేస్తుంది. పొడి చర్మాన్ని నిర్మూలించటంలో పెట్రోలియం జెల్లీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారకుండా చేస్తుంది.
బాదం నూనెతో మసాజ్ చేయండి
బాదం నూనె చర్మానికి టానిక్‌గా పనిచేస్తుంది. బాదం నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఈ నూనె చర్మానికి జీవం పోస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం కూడా చేస్తుంది.
ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా శీతాకాలంలో మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు.