Men Skincare | షేవింగ్‌కి క్రీమ్ వాడాలా.. ఫోమ్ వాడాలా? ఈ చిట్కాలు మగవారి కోసం!
సౌందర్య పోషణ ఆడవారికే కాదు మగవారికీ అవసరం అంటున్నారు నిపుణులు, మగవారి చర్మం కాంతివంతంగా మెరవాలంటే ఈ టిప్స్ పాటించాలంటున్నారు.
చాలా మందిలో ఒక అపోహా ఉంటుంది, చర్మ సంరక్షణ అనేది కేవలం ఆడవారికి మాత్రమే వర్తిస్తుంది. మగాడు ఎలా ఉన్నా పర్వాలేదు అని. నిజానికి ఇది మన సమాజంలో చాలా ఏళ్లుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పెళ్లి విషయంలో ఆడవారిని చూసుకోవడానికి మగవారు వస్తారు. కాబట్టి చూసే అబ్బాయికి నచ్చేలా, అందరూ మెచ్చేలా అందంగా ముస్తాబు అవ్వమని అమ్మాయిలకు చెప్పెవారు. ఎవరైనా మగవారు ముస్తాబైతే ఆడపిల్లల్లా అంతగా ఏం ముస్తాబవుతావంటూ వెక్కిరించేవారు. అయితే కాలం మారింది. ఇప్పుడు అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాలంటే అబ్బాయిలు కూడా గ్లామర్ మెయింటెన్ చేయాల్సిన పరిస్థితి. లేకపోతే చూసిన అమ్మాయి ఛీ.. అని రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది.
ఏదేమైనా చర్మ సంరక్షణ విషయంలో ఆడవారు, మగవారు అని తేడా ఉండదు. పురుషులకు కూడా చర్మ సంరక్షణ అవసరం. ఫేస్ వాషింగ్, మాయిశ్చరైజింగ్, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్‌లను ఉపయోగించడం మొదలైనవన్నీ పురుషుల రొటీన్ దినచర్యలోనూ భాగం కావాలి. స్కిన్ కేర్ స్పెషలిస్ట్ షాహీన్ భట్ మగవారికి చర్మ సంరక్షణ గురించి చిట్కాలను చెప్పింది. అలాగే మగవారు వాడే కొన్ని ఉత్పత్తులకు సంబంధించిన అపోహలను తొలగించే ప్రయత్నం చేసింది.
అన్నింటికీ ఒకటే సబ్బు
పురుషులు తరచుగా ముఖానికి, శరీరానికి, ఇతర భాగాలకు ఒకే సబ్బును ఉపయోగిస్తారు. కానీ ఇది తప్పు. శరీరంలోని మిగిలిన భాగాల కంటే ముఖంపైన చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. బాడీ సబ్బును ముఖానికి ఉపయోగించినప్పుడు అది ముఖం నుండి సహజ నూనెలను తీసివేస్తుంది. దీంతో ముఖం పొడిగా మారి పగుళ్లకు దారితీస్తుంది.అలాగే మీసాలు, గడ్డాలు తేమ కోల్పోయి పొడిగా ఎండిపోయిన గడ్డిలా మారుతుంది. కాబట్టి మగవారి చర్మ రకాన్ని బట్టి ముఖానికి సున్నితమైన క్లెన్సర్ ఉపయోగించడం మంచిది.
మాయిశ్చరైజర్
మగవారికి మాయిశ్చరైజర్ అవసరం లేదని భావిస్తారు. ఇది అపోహే. మాయిశ్చరైజర్ ఆడవారికి కంటే మగవారికే ఎక్కువ అవసరం. ఆడవారికంటే పురుషుల ముఖమే ఎక్కువ జిడ్డుగా మారుతుంది. దీనికి కారణం మాయిశ్చరైజర్ ఉపయోగించకపోవడమే. చర్మానికి తగిన మాయిశ్చరైజర్ లభించనప్పుడు చర్మం ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది. దీంతో చర్మం జిడ్డుగా మారుతుంది. కాబట్టి ఆడవారికైనా, మగవారికైనా మాయిశ్చరైజర్ ఉండాల్సిందే.
పురుషుల చర్మం ముదురుతుంది
ఆడవారితో పోలిస్తే మగవారి చర్మం ఎక్కువ ముదురుతుంది. ఇది వాస్తవం అని షాహీన్ భట్ పేర్కొంది. వయసు పెరిగేకొద్దీ పురుషుల్లో ముడతలకు దారితీస్తుంది, వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి 30 ఏళ్లు దాటిన పురుషులు యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను ఉపయోగించాలని షాహీన్ భట్ సిఫార్సు చేశారు.
షేవింగ్ క్రీమ్ లేదా ఫోమ్
షేవింగ్ క్రీమ్ లేదా షేవింగ్ క్రీమ్ ఇందులో ఏది మంచిది. చాలా మంది వీటి విషయంలో గందరగోళానికి గురవుతారు. అయితే ఇక్కడ ఫోమ్ లేదా క్రీమ్ అనేది ముఖ్యం కాదు, వాటిల్లో ఉపయోగించే మూలకాలపై దృష్టిపెట్టాలి. కలబంద ఇంకా గ్లిజరిన్ వంటి పదార్థాలతో కూడిన షేవింగ్ క్రీమ్‌ను ఉపయోగించాలని షహీన్ సిఫార్సు చేసింది.
ఇకపోతే ప్రైవేట్ ఏరియాలలో క్లీన్ చేసేటపుడు ప్రత్యేకమైన తేలికపాటి ఫోమ్ ఉపయోగించడం మంచిదని నిపుణులు పేర్కొన్నారు.
సంబంధిత కథనం