తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (Sip) లో ఇన్వెస్ట్‌మెంట్‌ వల్ల లాభమేంటి?

సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP) లో ఇన్వెస్ట్‌మెంట్‌ వల్ల లాభమేంటి?

28 February 2022, 17:40 IST

    • Systematic Investment Plan (SIP) | సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా అంటే నెలవారీగా లేదా త్రైమాసికంగా పెట్టుబడి పెట్టడం. సిప్‌లో ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి? దాని వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఆర్థిక క్రమ శిక్షణ అలవడుతుంది
ప్రతీకాత్మక చిత్రం: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఆర్థిక క్రమ శిక్షణ అలవడుతుంది (unsplash)

ప్రతీకాత్మక చిత్రం: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఆర్థిక క్రమ శిక్షణ అలవడుతుంది

మ్యూచువల్‌ ఫండ్లలో ఒకేసారి పెద్దమొత్తం పెట్టడం కంటే సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టడం మేలని ఫైనాన్షియల్‌ ప్లానర్లు చెబుతుంటారు. ఒక నిర్ధిష్ట మొత్తంలో నెలనెలా లేదా మూడు నెలలకోసారి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం రికరింగ్‌ డిపాజిట్‌ తరహాలోనే ఉంటుంది. ప్రతి నెలా ఆటోమేటిగ్గా మీ బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ చేయడానికి స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇస్తే సరిపోతుంది.

దీర్ఘకాలం ఇలా సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మార్కెట్‌ హెచ్చుతగ్గులు మీ మెచ్యూరిటీ సొమ్ముపై ప్రభావం చూపవు. చివరగా(మీరు తీసుకోవాలని భావించినప్పుడు) మార్కెట్‌ ఎలా ఉంటే అలా మీకు రాబడులు లభిస్తాయి.

ఎలా అంటే మీరు ప్రతి నెలా సిప్‌లో పెట్టుబడి పెడుతున్నారంటే.. ఒకవేళ మార్కెట్‌ సూచీలు తగ్గినప్పుడు మీ ఫండ్‌ విలువ తగ్గుతుంటుంది. అంటే తక్కువ ధరకే ఫండ్‌ యూనిట్లు మీ ఖాతాలో చేరుతాయి.

 

ఉదాహరణకు మీరు ఫండ్‌ కొనుగోలు చేసినప్పుడు ఎన్‌ఏవీ రూ. 10 ఉందనుకుందాం. క్రమంగా రూ. 13కు పెరిగింది. తిరిగి మార్కెట్‌ పడిపోయినప్పుడు రూ. 12కు వచ్చిందనుకుందాం. అంటే మీరు సిప్‌ ద్వారా ఆ నెలలో రూ. 12కే కొనుగోలు చేస్తారు. తద్వారా మీ కొనుగోలు రేటు బాలెన్స్‌ అవుతుంది.

అందువల్ల దీర్ఘకాలంలో గరిష్టంగా లాభాలు ఆర్జించే అవకాశమే ఎక్కువ. మార్కెట్‌ సూచీలు గరిష్ట శ్రేణుల్లో ఉన్నప్పుడు మీ ఫండ్‌ను రిడీమ్‌ చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు.

సిప్‌ తప్పితే ఎలా?

మీరు ఒకవేళ ఒకటి రెండు నెలలు సిప్‌ వాయిదాలు కట్టకపోయినా ఎలాంటి పెనాల్టీ ఉండదు. మీరు వాయిదాలు చెల్లించలేదని ఒకవేళ సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సిప్‌ ఆపితే మీకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. మీరు దీనికి బదులుగా ఇంకొక సిప్‌ను ఓపెన్‌ చేయవచ్చు.

అలాగే మీ సిప్‌ మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. మీ ఆదాయ లభ్యతను బట్టి సిప్‌ వాయిదా మొత్తాన్ని పెంచుకోవచ్చు. 

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ మీ ఆర్థిక క్రమశిక్షణకు పునాదులు వేస్తుందని, భవిష్యత్ అవసరాలకు తగిన రీతిలో నిధిని సమకూర్చిపెడుతుందని ఫైనాన్షియల్ ప్లానర్స్ చెబుతుంటారు.