Holiday Heart Syndrome । మీకు గుండె దడగా ఉంటోందా? అయితే అది ఇదే!
12 March 2023, 12:12 IST
- Holiday Heart Syndrome: మీకు అప్పుడప్పుడు గుండెలో దడగా అనిపిస్తుందా, అయితే అది హాలిడే హార్ట్ సిండ్రోమ్ కావచ్చు. ఇది గుండెకు సంబంధించిన ఒక పరిస్థితి, దీనికి కారణాలు, చికిత్స, నివారణ మార్గాలు చూడండి.
Holiday Heart Syndrome
హాలిడే హార్ట్ సిండ్రోమ్ అనేది గుండెలో కలిగే దడ. హృదయ స్పందనలు లయ తప్పడం ద్వారా కలిగే పరిస్థితి. ఎవరైనా ఒక వ్యక్తికి ఇదివరకు ఎలాంటి గుండె జబ్బులు లేకపోయినా, గుండెలో దడగా అనిపిస్తే, ఛాతీలో అసౌర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటే దానిని హాలిడే హార్ట్ సిండ్రోమ్ (Holiday Heart Syndrome) గా వర్గీకరిస్తారు. దీనికి కారణం మితిమీరిన ఆల్కాహాల్ వినియోగం. వ్యక్తి శరీరంలో ఎక్కువగా ఇథనాల్ చేరినపుడు వారిలో తీవ్రమైన కార్డియాక్ రిథమ్, రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడతాయి. అందుకే దీనిని ఆల్కహాల్-ప్రేరిత కర్ణిక అరిథ్మియాగా కూడా సూచిస్తారు.
పెద్ద మొత్తంలో ఆల్కహాల్ లేదా కెఫిన్ పానీయాలు సేవించడం. అధిక కలిగిన కొవ్వు పదార్ధాలను తినడం, తీవ్రంగా పెరిగే ఒత్తిడి స్థాయిలు, డీహైడ్రేషన్ మొదలైన కారణాలు ఈ సిండ్రోమ్ అభివృద్ధికి ప్రమాద కారకాలు.
సాధారణంగా వ్యక్తులు సెలవు రోజులలో, వారాంతాలలో, పండగ సీజన్‌లో నిర్వహించే విందులు వినోదాలలో పాల్గొని, మితిమీరిన ఆల్కాహాల్ సేవించి ఈ పరిస్థితి తెచ్చుకుంటారు. అందుకే దీనిని హాలిడే హార్ట్ సిండ్రోమ్‌గా పేర్కొంటున్నారు.
హాలిడే హార్ట్ సిండ్రోమ్ ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. అయితే ఇది వరకే గుండె సంబంధింత సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదం. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ పరిస్థితి గుండె వైఫల్యం, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుంది.
Holiday Heart Syndrome Symptoms- హాలిడే హార్ట్ సిండ్రోమ్ లక్షణాలు
- అలసటగా ఉంటుంది, సాధారణం కంటే ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించవచ్చు.
- ఛాతీ అసౌకర్యంగా అనిపిస్తుంది, ఛాతీ నొప్పి లేదా ఒత్తిడిని అనుభవించవచ్చు.
- మైకము ఎక్కువగా ఉంటుంది, తలతిరగడం లేదా మూర్ఛపోయినట్లు అనిపించవచ్చు.
- గుండె దడ పెరుగుతుంది, ఛాతీలో ఏదో అలజడి రేగినట్లుగా అనుభవించవచ్చు.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది, రోజువారీ కార్యకలాపాల చేసేటపుడు, విశ్రాంతి సమయంలో కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండవచ్చు.
Holiday Heart Syndrome Treatment - హాలిడే హార్ట్ సిండ్రోమ్ చికిత్స
హాలిడే హార్ట్ సిండ్రోమ్‌కు చికిత్స వ్యక్తి ఆరోగ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తరచుగా అనారోగ్యాల బారిన పడే వ్యక్తులకు డాక్టర్ కార్డియోవర్షన్‌ను సూచించవచ్చు, ఇది సాధారణ గుండె లయను పునరుద్ధరించడానికి తక్కువ-శక్తి షాక్‌లను ఉపయోగించే శస్త్రచికిత్స. అలాగే, సాధారణంగా మద్యపానానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు.
Holiday Heart Syndrome Prevention Tips- నివారణ మార్గాలు
ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ముప్పు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
మితంగా ఆహారం- విందులకు హాజరయ్యేటపుడు ఆహార, పానీయాలు మితంగా తీసుకోండి. ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్న సమయంలో తేలికైన భోజనం తినడానికి ప్రయత్నించండి, కొవ్వు పదార్థాలు, కేలరీలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకండి. అన్నింటికంటే ముఖ్యంగా అతిగా మద్యపానం సేవించడం నివారించండి.
చురుకుగా ఉండండి - మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చురుకైన జీవనశైలిని కలిగి ఉండండి. నిశ్చలంగా ఒక చోట ఉండకుండా సాధారణ వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి.
ఒత్తిడిని నియంత్రించండి- మద్యం అతిగా సేవించి ఒత్తిడి, ఆందోళనలకు గురికాకూడదు. ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉండటానికి ప్రయత్నించండి. రిలాక్స్‌గా ఉండటానికి ఉండటానికి అనేక ఉపాయాలు ఉన్నాయి. పుస్తకం చదవడం, ధ్యానం చేయడం లేదా నడకకు వెళ్లడం వంటివి. మీకు ఆనందం, విశ్రాంతిని కలిగించే కార్యకలాపాలలో సమయాన్ని వెచ్చించండి.
ఔషధాల విషయంలో జాగ్రత్త - మీరు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత హ్యాంగోవర్ లక్షణాలను అనుభవిస్తే, నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ల్ఫమేటరీ డ్రగ్స్ (NSAIDలు) తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ మందులు రక్తపోటును పెంచుతాయి, గుండె సమస్యలను మరింత దగ్గర చేస్తాయి.
ఇటీవల కాలంలో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్ వంటి సమస్యలు తీవ్రం అవుతున్నాయి. కాబట్టి మీ హృదయం పదిలంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.