Blue Banana । నీలిరంగు అరటిపండును ఎప్పుడైనా తిన్నారా? దీని రుచి, ప్రయోజనాలు వేరే లెవెల్!
19 February 2023, 15:20 IST
- Blue Banana: అరటిపండ్లను అందరూ తినే ఉంటారు. కానీ ఎప్పుడూ తినేవి కాకుండా నీలిరంగు అరటిపండ్లను ఎప్పుడైనా తిన్నారా? వీటి రుచి ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతాయో ఇక్కడ తెలుసుకోండి.
Blue Java Banana
అరటి పండ్లు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. పండిన అరటిపండ్లు పచ్చగా ఉంటాయి, కాయదశలో ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటాయి. కానీ ఈ రెండూ కాకుండా నీలి రంగు అరటిపండ్లు కూడా ఉంటాయి. వాటిని మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇవి మనం ఎప్పుడూ తినే అరటిపండ్ల కంటే ఇంకా టేస్టీగా ఉంటాయట. ఇంతకీ ఈ నీలిరంగు అరటిపండ్లు ఎక్కడ దొరుకుతాయి, వాటి రుచి ఎలా ఉంటుంది, మొదలైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
నీలిరంగు అరటిపండ్లను బ్లూ జావా బనాన పేరుతో పిలుస్తారు. ఇవి అరటిలో మూసా అక్యుమినాటా, మూసా బాల్బిసియానా అనే హైబ్రిడ్ రకం. ఈ రకమైన అరటిమొక్కలను ఎక్కువగా ఆగ్నేయాసియా, మధ్య అమెరికా, హవాయి దీవుల్లో సాగుచేస్తారు. వీటి తొక్కల్లో ఉండే ఒకరకమైన మైనపుపూత కారణంగా ఇవి కాయదశ నుంచే నీలిరంగును కలిగి ఉంటాయి. ఇవి సాధారణ అరటి రకాల కంటే మరింత మందంగా, క్రీమీగా ఉంటాయి, చిన్నటి నల్ల గింజలను కలిగి ఉంటాయి.
Blue Java Banana Taste Like- నీలి అరటిపండు రుచి ఎలా ఉంటుంది?
నీలిరంగు జావా అరటిపండ్లు అసాధారణమైన రుచిని కలిగి ఉంటాయి. ఇవి వెనీలా కస్టర్డ్ లేదా వెనీలా ఐస్ క్రీమ్ రుచితో సమానంగా ఉంటాయి. అందుకే వీటిని ఐస్ క్రీమ్ బనాన అని కూడా అంటారు. అరటిపండు గుజ్జు కూడా మృదువైన క్రీమ్ లాగా ఉంటుంది. సహజంగా తయారు చేసిన ఐస్ క్రీమ్ రుచి, అలాగే వీటి ప్రత్యేకమైన రంగు కారణంగా నీలిరంగు జావా అరటిపండ్లను డెజర్ట్‌లు, స్మూతీలలో కలిపి ఆస్వాదిస్తారు.
Blue Java Banana Health Benefits- ప్రయోజనాలు ఏమున్నాయి
ఒక నీలిరంగు అరటిపండు కేవలం 105 కేలరీలను కలిగి ఉంటుంది, అంటే ఐస్ క్రీమ్ కంటే చాలా రేట్లు తక్కువ. కాబట్టి ఐస్ క్రీమ్, స్మూతీస్, కస్టర్డ్ వంటి స్వీట్లను తినడానికి బదులు బ్లూ బనాన తింటే, మంచి రుచి ఉంటుంది. అధిక కేలరీలు చేరవు, తద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
నీలిరంగు అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, ఈ అరటిపండులోని ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రేగు కదలికలను క్రమబద్దీకరిస్తుంది, మలబద్ధకం సమస్య ఉండదు. అదనంగా, అల్సర్లు, హేమోరాయిడ్స్, గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి వంటి అనేక జీర్ణ వ్యాధులను కూడా నయం చేసే గుణాలు ఉన్నాయి. పరిశోధనలు సూచిస్తున్నాయి.