Spring season fruits: వసంత రుతువులో లభించే సీజనల్ పండ్లతో ఇమ్యూనిటీ పెంచుకోండి
14 February 2023, 16:26 IST
- Spring season fruits: వేసవి ఆరంభ సూచికగా వచ్చే వసంత రుతువులో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు ఈ కాలంలో లభించే పండ్లను తినాలని న్యూట్రిషనిస్ట్ చెబుతున్నారు.
వసంత రుతువులో లభించే సీజనల్ పండ్లతో ఇమ్యూనిటీ
వసంత ఋతువు ఉగాదితో మొదలవుతుంది. చలికాలం ముగిసి వేసవి కాలం రావడంతో వాతావరణం ఆహ్లాదకరమైన మలుపు తీసుకుంటుంది. మీ ఉన్ని దుస్తులను ప్యాక్ చేసి, ఇక తేలికైన బట్టలను తీయడానికి సమయం వచ్చేస్తుంది. ఈ సమయంలో వాతావరణం అనూహ్యంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు సాధారణం. దీని కారణంగా అనేక అనారోగ్యాలు సంభవించవచ్చు. సాధారణ జలుబు, దగ్గు, ఫ్లూ ఈ సీజన్‌లో ప్రబలంగా ఉంటాయి. అలెర్జీ కారకాలు, వైరస్‌లు సీజన్ మారుతున్న కొద్దీ దాడి చేస్తాయి. కాబట్టి మీ రోగనిరోధక శక్తిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సీజనల్ పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ బలపడుతుంది.
కాలానుగుణమైన పండ్లను తినడం ఆరోగ్యంగా ఉండటానికి ఉత్తమ మార్గం. అవి అసాధారణమైన పోషక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. చెర్రీస్ నుండి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే స్ట్రాబెర్రీస్ వరకు ఈ వసంత కాలంలో మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతాయని డీటీఎఫ్ ఫౌండర్, న్యూట్రిషనిస్ట్ సోనియా బక్షి తెలిపారు.
1. Cherries: చెర్రీస్
ఆహ్లాదకరంగా, జ్యూసీగా ఉండే చెర్రీస్‌ని అలాగే ఆస్వాదించవచ్చు. లేదా మీ డెజర్ట్‌లకు సహజమైన తీపిని, రుచిని అందించడానికి వాటితో కలిపి తినొచ్చు. ఈ సమయంలో చెర్రీస్ మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. అవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మనస్సును రిలాక్స్ చేయడంలో, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మీ రక్తంలో యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి.
2. Strawberries: స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలు సాధారణంగా వసంతకాలంలో పక్వానికి వచ్చే పండ్లలో మొదటివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వసంత ఋతువులో ఉత్సాహంగా ఉండేందుకు మీకు సహాయపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ని తగ్గిస్తాయి. బరువు అదుపులో ఉంచుకోవడంలో కూడా సహాయపడతాయి. మీరు వాటిని మీ సలాడ్స్‌లో భాగంగా తీసుకోవచ్చు. జామ్, లేదా జెల్లీ రూపంలో తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌ను తయారు చేసుకుని కూడా తినొచ్చు.
3. Blackberries: బ్లాక్ బెర్రీస్
వసంత రుతువులో లభించే బ్లాక్ బెర్రీస్‌తో స్మూతీ లేదా హెల్తీ ఓట్ పాన్‌కేక్ తయారు చేసుకుని తినొచ్చు. వీటిలో అధిక మొత్తంలో విటమిన్లు, ఫైబర్, తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి.
4. Oranges: నారింజ పండ్లు
నారింజ పండ్లు మీ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తహీనతతో పోరాడటానికి ఇనుమును గ్రహించడంలో సహాయపడతాయి. అవి మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వాటిని పండ్ల రూపంలో తినొచ్చు. లేదా నారింజ రసం తాగొచ్చు. మీ కేకులు, డెజర్ట్‌లకు మంచి రుచిని జత చేసేందుకు దాని పై తొక్కను ఉపయోగించండి.
5. Papaya: బొప్పాయి
సరసమైన ధరల్లో లభించే బొప్పాయి ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారికి సహాయపడతాయి. ఇవి బరువు తగ్గడాన్ని మరింత వేగవంతం చేస్తాయి. మీరు దీన్ని ఆరోగ్యకరమైన స్నాక్‌గా తీసుకోవచ్చు.