తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : మీతో మాట్లాడేవారంతా మిమ్మల్ని అర్థం చేసుకుంటారనుకోకండి..

Wednesday Motivation : మీతో మాట్లాడేవారంతా మిమ్మల్ని అర్థం చేసుకుంటారనుకోకండి..

21 December 2022, 6:15 IST

google News
    • Wednesday Motivation : మనం ఏమి చెప్పకుండానే.. మనం వారితో ఉండే విధానం బట్టి.. ఇతరులు చెప్పిన మాటాలు కాకుండా.. మనల్ని నమ్మే, అర్థం చేసుకునే వ్యక్తులు దొరకడం చాలా కష్టం. కానీ అలా ఎవరూ మనకి దొరకరు. కాబట్టి ఎదుటివారికి మనం ఏమిటి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లకి నచ్చినట్టు వారే మన గురించి ఓ అభిప్రాయం కలిగి ఉంటారు.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : మీ జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకుని.. మిమ్మల్ని నమ్మే వ్యక్తులు.. మిమ్మల్ని ప్రేమించేవారు ఉంటే నిజంగా మీరు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే ఈ కాలంలో మనల్ని నమ్మి.. మనల్ని మనగా దగ్గరకు తీసుకునే, అర్థం చేసుకునే వ్యక్తులు చాలా రేర్. కొన్నిసందర్భాల్లో దొరకరు అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరి వరకో ఎందుకు.. మనమే కొందరిని నమ్మడానికి చాలా సమయం తీసుకుంటాం. వారిని, వారి పరిస్థితిని అర్థం చేసుకోము. ఒకవేళ వారి పరిస్థితి ఇది అని చెప్పినా.. మనం లెక్కచేయము. ఎందుకంటే మన ఆలోచనల్లో కూడా వాళ్లని ఏదో కేటగిరిలో పెట్టేసి ఉంటాము కాబట్టి.

అలాగే ఇతరులు కూడా మిమ్మల్ని సరైన రీతిలో గుర్తించకపోవచ్చు. రోజూ మీరు వారితో మాట్లాడుతున్నా.. మీరు మీలాగే వారి దగ్గరున్నా కూడా వారు మిమ్మల్ని ఏమాత్రం అర్థం చేసుకోకపోవచ్చు. వాళ్ల ఆలోచలన్ని కూడా తప్పుపట్టలేం. ఎందుకంటే మనుషులందరూ ఒకేలాగా ఆలోచిస్తే.. ఇన్ని గొడవలు, యుద్ధాలు ఎందుకు చెప్పండి. వారి వారి అవగాహన స్థాయిలో మనల్ని అర్థం చేసుకుంటారు. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు.. ఎవరికీ మనం ఏంటి అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటే అంతే అర్థం చేసుకుంటారనుకుని ముందుకు సాగిపోవాలి.

కొన్ని సమయాల్లో మనం చాలా ఒంటరిగా భావిస్తాము. మనల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాము. ఆ సమయంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులకు మన గురించి చెప్పడం ప్రారంభిస్తాము. వారి సానుభూతి పొందాలని చూస్తాము. కానీ ఎప్పుడూ అలా చేయకండి. ఇలా చేస్తే ఓ వ్యక్తిపై మీరు బలవంతంగా ఓ అభిప్రాయాన్ని రుద్దాలని చూస్తున్నట్లే అవుతుంది. ఒకవేళ మీరు చెప్పినా వాళ్లు అర్థం చేసుకోకపోతే.. అది మిమ్మల్ని ఇంకా బాధపెడుతుంది. కాబట్టి ఒంటరిగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఎవరిపైనా డిపెండ్ అవ్వొద్దు. ఎవరో మనల్ని అర్థం చేసుకోవాలని ఎదురు చూడవద్దు.

అందరూ మంచి వారు కాకపోవచ్చు. అలా అని అందరూ చెడ్డవారు కూడా కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా అని ప్రతిసారీ వారు అదే చేస్తారు అనుకోవడం తప్పే. ఓ వ్యక్తి తప్పు చేసినా.. ఒప్పు చేసినా దాని వెనుక ఏదొక బలమైన కారణం, పరిస్థితులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ.. అపార్థం చేసుకోకూడదు. అప్పుడేదో చేశారని ఇప్పుడు వారిని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎదుటివారిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ అపార్థం చేసుకోకండి. అలాగే ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే.. దయచేసి మీ గురించి.. మీ పరిస్థితి గురించి వివరించకండి. వారికి మీరు నిజంగా ఆప్తులైతే.. వారే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. వాళ్లు అర్థం చేసుకోకపోయినా మీరేంటో మీకు తెలుసు కాబట్టి. ధైర్యంగా ఉండండి. ఎవరూ అర్థం చేసుకోవట్లేదని బాధపడకండి.

తదుపరి వ్యాసం