తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Couple Goals | పెళ్లైన కొత్తలో ఉండే ఫన్, కొన్నాళ్లకు ఫ్రస్ట్రేషన్‌గా మారకూడదంటే?

Couple Goals | పెళ్లైన కొత్తలో ఉండే ఫన్, కొన్నాళ్లకు ఫ్రస్ట్రేషన్‌గా మారకూడదంటే?

HT Telugu Desk HT Telugu

07 September 2022, 22:40 IST

    • ప్రేమతో పెనవేసుకున్న మీ బంధంలో చీలికలు వస్తున్నాయి. ఒకప్పటి ఇష్టం నేడు విసుగెత్తిపోతుందా? కళ తప్పిన మీ బంధంలో కలర్స్ నింపాలంటే ఇక్కడ కొన్ని మార్గాలున్నాయి.
Couple Goals
Couple Goals (Pixabay)

Couple Goals

ఈరోజుల్లో అనేక జంటలు చాలా కాలం పాటు కలిసి జీవించిన తర్వాత కూడా విడిపోతున్నారు. ఇందులో పెళ్లికి ముందే కొంతకాలం పాటు సహజీవనం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకొని, ఆపై కొంతకాలం కాపురం చేసి, ఆ తర్వాత విడిపోయేవారు కూడా ఉన్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కొన్నాళ్ల వరకు ప్రేమతో పెనవేసుకున్న వీరి బంధం కాలం గడిచే కొద్దీ బీటలు ఎందుకు వారుతోంది. ఒకప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారు కొంత కాలానికే ధ్వేషంతో ఎందుకు రగిలిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారు? అనే ప్రశ్నలకు మనస్తత్వవేత్తలు సమాధానాలు ఇచ్చారు.

పెళ్లైన కొత్తలో ఆకర్షణ, ఒకరకమైన ఉత్సాహం ఉంటుంది. అయితే ఆ ఉత్సాహం కాలక్రమేణా కరిగిపోవటం ఒక కారణం. కాలం గడిచే కొద్దీ పెరిగే బాధ్యతలు, కుటుంబ కట్టుబాట్లు, అనుమానాలు ఇలా అనేకం ఉంటాయి. ఈ రకమైన సమస్యలతో తరచుగా విసుగుచెందితే వారి ప్రేమను ద్వేషం భర్తీ చేస్తుంది, ఫలితంగా చీలిక ఏర్పడుతుంది. కొన్నిసార్లు వారికి విడిపోవాలని నిజంగా లేకున్నా.. వారి మనసులోతుల్లో ప్రేమ దాగి ఉన్నా అది బలవంతపు అణిచివేతకు గురవుతుంది. ఈ రకంగా జంటలు తమను తామే మోసం చేసుకుని విడిపోయే పరిస్థితులను తెచ్చుకుంటారు.

అయితే మీకు ఇలాంటి పరిస్థితులే ఎదురైతే, కళతప్పిన మీ వైవాహిక జీవితంలో మళ్లీ రంగులు నింపడానికి నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. వాటిని అనుసరిస్తే బంధం నిలబడుతుందని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకోండి.

చిన్న విషయాలకు మనసు పాడు చేసుకోకండి

ఒక్కోసారి మన కళ్లు చూసేది, మనం వినేది నిజం కాకపోవచ్చు. ఒకవేళ నిజమే అయినా అందుకు దారితీసే బలమైన కారణాలేవైనా ఉండవచ్చు. మీ భాగస్వామి మీతో ఈ విషయాలను పంచుకోకపోవచ్చు. అలాంటపుడు మీరు కలత చెంది మనసు పాడుచేసుకోవద్దు. చిన్న విషయాలను భూతద్దంలో చూస్తూ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పాడుచేసుకోవద్దు. మీ భాగస్వామి ఎలాంటి వారనేది మీకు తెలుసు. కాబట్టి కొన్ని విషయాలను మరీ పెద్దగా చేసుకోకుండా చర్చలతో సమస్య పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. కోపంగా కాకుండా ప్రేమగా తెలియజెప్పి చూడండి.

మీ భాగస్వామి వద్ద సిగ్గుపడకండి

ఇంటికి సంబంధించిన నిర్ణయాల నుండి శృంగారం వరకు, మీ భాగస్వామితో ప్రతీది బహిరంగంగా మాట్లాడండి. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది తెలియజేయండి. మీ ఫాంటసీలు, భావాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి సిగ్గుపడకండి.

భాగస్వామికి కృతజ్ఞత తెలియజేయండి

చాలాసార్లు మీ భాగస్వామి మీపై అపారమైన ప్రేమను కురిపించవచ్చు. ఇది మీకు సాధారణమే అనిపించవచ్చు. కానీ అప్పుడప్పుడైనా వారిని కేర్ చేయండి. కృతజ్ఞతలు తెలపండి. మీ భాగస్వామి మాటలు, చూపులు, మీ కోసం తయారుచేసిన ఆహారాన్ని మెచ్చుకోండి. ఇది మీ బంధాన్ని బలోపేతం చేయడంతో పాటు మీ మధ్య ప్రేమను కూడా పెంచుతుంది.

హాలిడే ప్లాన్ చేసుకోండి

బిజీ జీవితంలో కలిసి గడపటానికి సమయం దొరకకపోవచ్చు. జీవితంలో మునుపటిలా రంగును నింపుకోవడానికి, మధ్యమధ్యలో మీ భాగస్వామితో కలిసి హాలిడేని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. పని నుండి కొన్ని రోజులు సెలవు తీసుకొని జంటగా విహరించండి. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉండడంతో పాటు బంధాన్ని బలపరుచుకోగలుగుతారు.

కౌన్సిలర్ సహాయం తీసుకోండి

చాలా సార్లు మన వైవాహిక జీవితంలోని సమస్యలను మనమే కొనితెచ్చుకుంటాము, ఆపై ఆ సమస్యను హ్యాండిల్ చేయలేకపోతాము. మీ సమస్యకు మీరు పరిష్కారం కనుగొనలేకపోతున్నారని మీరు భావిస్తే, రిలేషన్ షిప్ కౌన్సెలర్ సహాయం తీసుకోవడం మంచిది.

టాపిక్