వైవాహిక జీవితంలో కలతలా.. ఇలా చేసి చూడండి!
చాలా మంది దంపతులు అనుమానాలు, అపార్థాలు, కోపతాపాలతో సంసారాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి దంపతుల మధ్య గొడవకు ఇప్పుడు చెప్పబోయే విషయాలే ప్రధానంగా కారణమవుతున్నాయి.
దాంపత్య బంధంలో భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమే. కానీ చిన్న గొడవలకే విడాకుల వరకు వెళ్లడం.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే కొన్ని సూచనలు పాటించి చూడండి. ఇవి మీ దాంపత్య జీవితాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి ఉపయోగపడవచ్చు.
కలతలు సహజం
సంసారంలో కలతలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. ఆ అడ్డంకులను తొలిగించుకుంటూ జాగ్రత్తగా ముందుకు సాగాల్సిందే. సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలి. వివాదాలతో కాదు. తప్పు మీదే అయినప్పుడు మీ భాగస్వామికి సారీ చెప్పండి. చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు వాటిని మరచిపోయి.. ఒకరి పనుల్లో మరొకరు సాయం చేసుకుంటే.. అది ఎదుటివారిపై ఉన్న కోపం తగ్గేలా చేస్తుంది.
కోపం వద్దు
చిన్న చిన్న పొరపాట్లకు కూడా భాగస్వామిపై చిర్రుబుర్రులాడొద్దు. కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. తరచూ కోపం వస్తుందంటే.. మీ మెదడులో నెగటివ్ ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయని గుర్తుంచుకోండి. ఈ కోపం బంధాన్ని బలహీనపరుస్తుంది. ఎదుటి వారు ఏదైనా తప్పు చేస్తే.. అరవకండి. అది వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఇది వెంటనే మార్పు తీసుకురాకపోయినా.. మెల్లగా వాళ్లు కూడా అర్థం చేసుకుంటారు.
ప్రైవసీ
దాంపత్య జీవితంలో ప్రైవసీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మీ సంసారంలో మూడో వ్యక్తి ప్రమేయం ఉండకుండా చూసుకోండి. ఏది జరిగినా ఇద్దరి మధ్య ఉండాలి. చాలా విషయాల్లో గోప్యత వహించాలి. ఒకవేళ మూడో వ్యక్తి సాయం కావాలంటే.. ఆ వ్యక్తి ఇద్దరికీ సన్నిహితులై ఉండాలి. మీ మధ్య ఉన్న గొడవల అంశాలను చర్చిస్తున్నప్పడు ఒకరిపై ఒకరు వాళ్లకి ఫిర్యాదు చేస్తున్నట్టుగా.. తప్పులను ఏకరువు పెట్టినట్టుగా ఉండకూడదు. సున్నితంగా సమస్యను వివరించండి. మీ సమస్య ఏంటో వాళ్లు అర్థం చేసుకుంటారు.
శృంగారం
భార్యాభర్తల బంధంలో శృంగారం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఓ మార్గం. జీవితంలో కొంచెం రొమాన్స్ ఉండాలి. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ ముఖ్యమైన విషయానికి సమయం కేటాయించడం మరచిపోకండి.
సంబంధిత కథనం