తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అక్కడ నూతన వధూవరులకు మొదటి మూడు రోజులు ముచ్చెమటలే.. అర్జంటయితే ఇక అంతే

అక్కడ నూతన వధూవరులకు మొదటి మూడు రోజులు ముచ్చెమటలే.. అర్జంటయితే ఇక అంతే

Manda Vikas HT Telugu

28 December 2021, 9:42 IST

    • కొత్తగా పెళ్లైన జంట మూడు రోజుల పాటు వాష్ రూం ఉపయోగించటం నిషేధం. ఎవరు గమనించినా, గమనించకపోయినా పగలు, రాత్రి ఎప్పుడూ పొరపాటున కూడా వాష్ రూం ఉపయోగించకూడదు. ఎలాంటి విసర్జన కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఇంతకీ ఈ విచిత్ర ఆచారం ఎక్కడ అమలు చేస్తున్నారు అని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే!
Wedding- Representational Image
Wedding- Representational Image (AFP File Photo)

Wedding- Representational Image

వివాహం అయిన తర్వాత ఆలుమగలనిద్దరినీ ఒక గదిలో బంధించి, వారు ఒక మూడురోజుల పాటు బయటకు రాకుండా గడియ పెట్టి కనీసం వారికి వాష్ రూం కూడా ఉపయోగించలేని స్థితి కల్పిస్తే ఎలా ఉంటుంది, ఒకసారి ఆలోచించండి? ఇదేం శాడిజం అనిపిస్తుంది కదూ? కానీ ఓ కమ్యూనిటీకి చెందిన ప్రజలకు మాత్రం ఇందులో విచిత్రమేమి లేదు. ఎందుకంటే ఇది వారి వివాహ తంతులో భాగంగా తప్పకుండా పాటించాల్సిన ఓ వింత ఆచారం.  ఇదెక్కడి ఆచారంరా బాబూ, ఇంతకీ ఈ విచిత్ర ఆచారం ఎక్కడ అమలు చేస్తున్నారు అని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే!

ఆచారం ఎక్కడుందంటే?

ఇండోనేషియాలో టిడాంగ్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తారు. వారి వివాహ కట్టుబాట్ల ప్రకారం కొత్తగా పెళ్లైన జంట మూడు రోజుల పాటు వాష్ రూం ఉపయోగించటం నిషేధం. ఎవరు గమనించినా, గమనించకపోయినా పగలు, రాత్రి ఎప్పుడూ పొరపాటున కూడా వాష్ రూం ఉపయోగించకూడదు. ఎలాంటి విసర్జన కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ కట్టుబాట్లను విస్మరిస్తే వారి వైవాహిక జీవితం దుర్భరంగా మారుతుందని, సంతానం కలగదని, ఒకవేళ సంతానం కలిగినా వారు బ్రతికుండరని తమ శాస్త్రాల చెబుతున్నాయని అక్కడివారు అంటున్నారు. 

అన్నపానీయాలు తక్కువ తీసుకుంటారు

ఈ క్రమంలో, టిడాంగ్ కమ్యూనిటీలో కొత్తగా వివాహం చేసుకున్న జంటలు తొలి మూడు రోజులు తమ కఠినమైన ఆచారాన్ని పాటించేందుకు ముందస్తుగా సిద్ధమవుతారు. వివాహానికి ముందే పెళ్లికొడుకు, పెళ్లి కూతురు అన్ని కార్యక్రమాలు ముగించుకొని తర్వాతి మూడు రోజుల వరకు తక్కువ పరిమాణంలో ఆహరం, నీరు తీసుకుంటారు. ఈ కొత్త జంట వాష్ రూం ఉపయోగించకుండా చూసేందుకు బంధువులు కాపలాగా ఉంటారు. ఇలా పెళ్లైన జంట మూడు రోజుల పాటు ఈ ఆచారాన్ని పాటిస్తే వారి వైవాహిక జీవితం అంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని, ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుందని వీరి ప్రగాఢ నమ్మకం.