తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mahashivratri 2024: శివరాత్రి జాగారంలో ఈ శక్తివంతమైన శివ మంత్రాలను జపించండి, అంతా మంచే జరుగుతుంది

Mahashivratri 2024: శివరాత్రి జాగారంలో ఈ శక్తివంతమైన శివ మంత్రాలను జపించండి, అంతా మంచే జరుగుతుంది

Haritha Chappa HT Telugu

08 March 2024, 15:08 IST

    • Mahashivratri 2024: మహాశివరాత్రి వచ్చిందంటే శివుని ఆలయాలు కిటకిటలాడిపోతాయి. ప్రపంచంలో నలుమూలలా ఉన్న శివ భక్తులు ఈ శివరాత్రి కోసం ఎదురు చూస్తారు.
శక్తివంతమైన శివమంత్రాలు
శక్తివంతమైన శివమంత్రాలు (pexels)

శక్తివంతమైన శివమంత్రాలు

Mahashivratri 2024: మహాశివరాత్రి హిందువులకు ప్రధానమైన పండగలలో ఒకటి. ప్రపంచంలో ఈ మహాశివరాత్రి కోసం ఎంతగానో ఎదురుచూసే భక్తులు ఎంతోమంది. శివాలయాలు మహాశివరాత్రి రోజు భక్తులతో నిండిపోతాయి. ఈ రోజున ఉపవాసం చేయడంతో పాటు ఎంతోమంది భక్తులు జాగారం చేస్తారు. జాగారం చేస్తూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడడం కాదు, నిత్యం శివ పారాయణం చేయాలి. శివుడు శక్తివంతమైన మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం దక్కుతుంది. శివుడి శక్తివంతమైన మంత్రాలను ఇక్కడ ఇచ్చాము. వీటిని జాగారం చేస్తున్న రాత్రి ఈ మంత్రాలను జపిస్తూ ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. శివుడి కృపా, కటాక్షం మీకు లభిస్తుంది.

ఓం నమః శివాయ

శివునికి అంకితం చేసిన అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఓం నమః శివాయ ఒకటి. ప్రతి భక్తుడికి నాలిక మీద తారాడే మహామంత్రం ఇది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనస్సు, శరీరం, ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు. ప్రాపంచిక అనుబంధాల నుంచి విముక్తి పొందవచ్చు. మహాశివరాత్రి రోజు జాగారం చేసే సమయంలో ఓం నమశ్శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కోరికలు తప్పక తీరుతాయి.

మృత్యుంజయ మంత్రం

ఓం త్ర్యంబకం యజామహే

సుగంధిం పుష్టి వర్ధనం

ఉర్వారుకమివ బంధనాన్

మృత్యోర్ముక్షీయ మామృతాత్

మరణ భయాన్ని తొలగించే మహా మృత్యుంజయ మంత్రం ఇది. దీన్ని మృత సంజీవని మంత్రం అని కూడా అంటారు. దీన్ని జపించడం వల్ల దీర్ఘాయుతో పాటూ, ఆరోగ్యమూ లభిస్తుంది. అలాగే శివుని రక్షణ దొరుకుతుంది. ఇది అకాల మరణాన్ని దూరం చేస్తుంది.

శివ రుద్ర మంత్రం

ఓం నమో భగవతే రుద్రాయ నమః

ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శివ భక్తుడు తనను రక్షించమని, ఆశీర్వదించమని, ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని కలిగించమని ఆ శివుడిని అడుగుతున్నట్టు. రుద్ర భగవానుడు శివుని ఉగ్రరూపంగా చెబుతారు. తన భక్తులను శివుడు ఈ రుద్ర భగవానుడి రూపంలోనే రక్షిస్తాడని అంటారు. ఈ శివ మంత్రాన్ని జపించడం వల్ల మీలో పరివర్తన వస్తుంది. మీ మార్గానికి అడ్డుపడుతున్న అవరోధాలన్నీ తొలగిపోతాయి.

శివ గాయత్రీ మంత్రం

ఓం తత్పురుషాయ విద్మహే

మహాదేవాయ ధీమహి

తన్నో రుద్ర ప్రచోదయాత్

ఇదే శివ గాయత్రీ మంత్రం. ఇది పురాతన మంత్రాలలో ఒకటి. ప్రజలు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ పరమ పవిత్రమైన శివుడు ఎంతో సంతోషిస్తాడు. భక్తులకు జ్ఞానోదయాన్ని, తెలివిని అనుగ్రహిస్తారు. జాగారం చేస్తున్న రాత్రి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. దేవుని దైవానుగ్రహం ఉంటుంది.

శివ యజుర్ మంత్రం

కర్పూర గౌరం కరుణావతారం

సంసార సారం భుజగేంద్ర హారం

సదా వసంతం హృదయాన విందే

భవం భవానీ సహితం నమామి

శివ యజుర్ మంత్రాన్ని శివునికి హారతి ఇచ్చే సమయంలో ఎక్కువగా జపిస్తూ ఉంటారు. ఇది శివుని లక్షణాలు, గుణాలను వర్ణించే అందమైన మంత్రం. శివ భక్తుడు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే శివపార్వత్తులు ఆనందంగా వింటారని అంటారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల శివుడు మరింత స్వచ్చంగా భక్తులకు దర్శనమిస్తాడు. భక్తుడిని ఆ స్వచ్ఛత, ప్రేమ రక్షణగా నిలుస్తాయని అంటారు.

పైన చెప్పిన శివ మంత్రాలను మహాశివరాత్రి పర్వదినాన తప్పకుండా జపించండి. జాగారం చేస్తున్న భక్తులు ఈ ఐదు మంత్రాలను జపించడం వల్ల వారికి కావాల్సిన పుణ్యం దక్కుతుంది. వారు అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి.

టాపిక్