తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know Complete Wedding Cost Estimations Event Wise Here

Wedding Cost estimations: మధ్య తరగతి వివాహానికి ఖర్చు ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

25 November 2022, 11:01 IST

    • Wedding Cost estimations: ఒక మధ్య తరగతి వివాహానికి జరిగే ఖర్చుపై మీకు అంచనా ఉందా? వివాహ వేడకుల గురించి కలలు కనే ముందు ఈ అంచనాలు ఒకసారి చదవండి.
ప్రస్తుత సీజన్‌లో దాదాపు 30 లక్షల వివాహాలు ఉన్నట్టు అంచనా
ప్రస్తుత సీజన్‌లో దాదాపు 30 లక్షల వివాహాలు ఉన్నట్టు అంచనా (MINT_PRINT)

ప్రస్తుత సీజన్‌లో దాదాపు 30 లక్షల వివాహాలు ఉన్నట్టు అంచనా

Wedding Cost: పెళ్లి చేసుకోబోతున్న వారికి, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. రాకుమారుడు రావాలని అమ్మాయి, ఏంజెల్ రావాలని అబ్బాయి కలలు ఒకవైపు, ఆకాశం లాంటి పందిరి వేసి పెళ్లి జరిపించాలని తల్లిదండ్రులూ ఆశ పడతారు. ఇలా కలలు కనడంలో, ఆశించడంలో తప్పులేదు. మీ దగ్గర భవిష్యత్తుకు సరిపడా కాసులు ఉంటే ఖర్చు చేయడంలో కూడా తప్పులేదు.

కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే.. సొసైటీ ఏమనుకుంటుందోనన్న పిచ్చి భ్రమల్లో పడతారు చూడండి. లేదా పక్కోడు అలా చేశాడు.. మనం ఇంకా గ్రాండ్‌గా చేసి మన సత్తా ఏంటో చూపిద్దాం.. అంటూ పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటారు. మీ దగ్గర లేకున్నా అప్పులు చేసి, ఆస్తులు అమ్మి పెళ్లిళ్లు చేస్తారు. ఇక్కడే మొదలవుతుంది ఆర్థిక సమస్య.

కోవిడ్ కంటే ముందు గ్రాండ్‌గా చేయడం, లావిష్‌గా ఖర్చు చేయడం ఒక ప్రెస్టీజ్‌గా మారింది. కోవిడ్ అంతా భూగోళాన్ని షేక్ చేసి పడేసింది. వివాహ వేడుకలకు 20 మందికి మించొద్దన్న ఆంక్షలు వచ్చాయి. ఇది చాలా మందికి లక్షల రూపాయలను మిగిల్చింది. మీరు పచ్చగా ఉంటే పక్కోడో ఏడ్చే రోజులివి. అందుకే చాలా సింపుల్‌గా, ఆత్మియులనుకున్న వారిని మాత్రమే పిలుచుకుని వివాహ వేడుకలను హాపీగా జరుపుకోండి.

బాబోయ్.. వివాహానికి ఇన్ని ఖర్చులా?

వివాహం అంటే ఒక్క రోజులో అయిపోయేది కాదు. పెళ్లి చూపులు, ఎంగేజ్‌మెంట్, సంగీత్, వివాహం, రెసెప్షన్, హనీమూన్ ఇలా ఐదారు ఈవెంట్లు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీటన్నింటికీ ఖర్చు తడిసిమోపెడవుతుంది.

ఆయా సందర్భాలను బట్టి రకరకాల దుస్తులు, జువెల్లరీ, యాక్సెసరీస్, శుభలేఖలు, రవాణా ఖర్చులు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డెకరేషన్, భోజనం-క్యాటరింగ్ ఖర్చులు, అతిథులకు ఏర్పాట్లు, ప్రి వెడ్డింగ్ షూట్స్.. ఇలా అంతులేని కథగా మారుతుంది. దోస్తులకు మందు పార్టీలు ఇక మామూలుగా ఉండవు.

ఒక తండ్రి తన కూతురికి వివాహం జరపాలనుకుని ఒక 500 మంది అతిథులు వస్తారని అంచనా వేసుకున్నారనుకోండి. ఒక్కసారి ఈ కింది ఖర్చులు చూడండి. మీకు కూడా ఒక అంచనా వస్తుంది.

వెడ్డింగ్ కాస్ట్ అంచనాలు

అంశంఖర్చు (రూపాయల్లో)
జువెల్లరీ5,00,000
బట్టలు1,50,000
యాక్సెసరీస్50,000
ఎంగేజ్‌మెంట్ (రింగ్, బట్టలు, భోజనాలు)2,00,000
మేకప్, బ్యూటీపార్లర్, కాస్మొటిక్స్15,000
వెడ్డింగ్ కార్డ్స్20,000
పూజ సామాగ్రి, పూలు20,000
వివాహం జరిపించే బ్రాహ్మణుడికి20,000
పెళ్లి పందిరి70,000
కళ్యాణ మండపం1,00,000
క్యాటరింగ్ - ఫుడ్ ఖర్చు2,50,000
రవాణా ఖర్చు50,000
 ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ2,00,000
 టెంట్ హౌజ్ ఖర్చు25,000
వివాహ వేడకల సంప్రదాయ సేవలు, శ్రామికులు30,000
ఇతరత్రా50,000
మొత్తం17,50,000

చూశారుగా.. ఒక మధ్య తరగతి వివాహానికి అయ్యే ఖర్చు అంచనా ఇది. దాదాపుగా రూ. 17.50 లక్షల ఖర్చవుతుంది. ఇక మన స్థోమతను బట్టి బారాత్, మందు పార్టీలు, బాణా సంచా, ఇవన్నీ అదనం. క్యాటరింగ్ ఖర్చులు కూడా సాధారణ భోజనానికి అయ్యే ఖర్చు ఇక్కడ రూ. 2,50,000గా అంచనా వేశాం. మెనూను బట్టి ఈ ఖర్చు డబులయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక వేడుకలు జరిగే నగరం, పట్టణాన్ని బట్టి ఖర్చులు పెరిగేందుకు, తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

ఇవన్నీ కాకుండా ఆడ పిల్లల తల్లిదండ్రులకు కట్నకానుకల సమస్యలు వెన్నాడుతూనే ఉంటాయి. తమ సంతానం భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదని, అత్తింటి వారి నుంచి మాట రాకూడదని వారికి స్థలమో, బంగారమో, నగదో, ఇంకేదైనా రూపంలో కట్నంగా ఇస్తుంటారు. కొందరు అత్తింటి వారు డిమాండ్ చేసి మరీ లాక్కుంటారనుకోండి అది వేరే విషయం. మన ఎంపికను బట్టి ఉంటుంది. ఇది ఇప్పటి సంప్రదాయాన్ని అనుసరించి అమ్మాయి వివాహానికి తల్లిదండ్రులు చేసే ఖర్చుగా భావించండి. ఇందులో ఫంక్షన్ హాల్, భోజన ఖర్చులు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి ఖర్చులు వరుడి కుటుంబం షేర్ చేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది.

మొత్తంగా ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే మీరు ఘనంగా, అట్టహాసంగా వివాహం చేసుకునేముందు మీ ఆర్థిక స్థితిని అంచనా వేయండి. అప్పు చేసి వివాహం చేయాల్సి వస్తే మాత్రం సాధ్యమైనంత మేరకు వివాహం సింపుల్‌గా చేసేయండి. వధూవరులను కూడా ఈ దిశగా ఒప్పించండి.

ఖర్చు లేకుండా వివాహం చేసుకునే ఆప్షన్లు

1. దేవాలయాల్లో కళ్యాణ మండపాలు, వేదికలు ఉంటాయి. చాలా నామమాత్రపు రుసుముతో అక్కడ వివాహం చేసుకోవచ్చు. అతిథులు పరిమితంగా వస్తారు. అక్కడ క్యాటరింగ్ ఖర్చు కూడా తక్కువే.

2. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వివాహం. దగ్గరి బంధువులు, ఆత్మీయ స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకుని, ఇంటి దగ్గరే వారికి భోజన ఏర్పాట్లు చేయడం.

3. చిన్న కళ్యాణ మండపం బుక్ చేసుకుని పరిమితంగా అతిథులను పిలవడం

4. టీటీడీ వంటి ట్రస్టులు నిర్వహించే సామూహిక వివాహ వేడుకల సమయంలో వివాహం చేసుకోవడం.

టాపిక్