తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mental Health- Food। ఇలాంటి ఆహారాలు అధికంగా తీసుకుంటే.. మీ మానసిక స్థితికి పెద్ద దెబ్బ!

Mental Health- Food। ఇలాంటి ఆహారాలు అధికంగా తీసుకుంటే.. మీ మానసిక స్థితికి పెద్ద దెబ్బ!

HT Telugu Desk HT Telugu

27 February 2023, 8:07 IST

google News
    • Mental Health: ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను నివారించాలి, లేదంటే మానసిక స్థితి దెబ్బతింటుంది.
Foods - Mental Health
Foods - Mental Health (Unsplash)

Foods - Mental Health

మనం జీవించాలంటే ఆహారం అవసరం, కానీ మనం ఆరోగ్యంగా జీవించాలంటే మాత్రం మన ఆహారపు అలవాట్లు కీలకం. ఆహారం వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం కలిగిఉంటుంది. ఈరోజుల్లో చాలా మంది ప్రజలు ఎల్లప్పుడు ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇందుకు గల కారణాల్లో మీ తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం కావచ్చు. మీరు తినే ఆహారం కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు లేదా మానసిక స్థితికి విఘాతం కలిగించవచ్చు. మీ మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే కొన్ని ఆహార పానీయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

మద్యం

ఆల్కహాల్ మెదడులోని సెరోటోనిన్, ఇతర న్యూరోట్రాన్స్మిటర్ల కార్యకలాపాలను మారుస్తుంది. ఇది తక్షణమే ఆలోచనలను పెంచుతుంది. ఆందోళన, ఒత్తిడిని పెంచుతుంది. మద్యం సేవించడం వల్ల మనిషికి చిరాకు వస్తుంది. తరచుగా మద్యం సేవించడం వలన అది మీ మెదడుపై దుష్ప్రభావం చూపి మతిమరుపు, అల్జీమర్స్ వంటి పరిస్థితులకు దారితీస్తుంది. మీరు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలనుకుంటే, వెంటనే మద్యం సేవించడం మానేయండి.

కెఫిన్

తలనొప్పిగా ఉందని చాలా మంది ఒక కప్పు కాఫీ, టీలను తాగుతుంటారు. కానీ వీటిల్లో కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్ మీలో ఒత్తిడి స్థాయిలను కూడా పెంచుతుందని మీకు తెలుసా. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, తలనొప్పి తగ్గించుకోవటానికి మీరు మామూలు టీ లేదా కాఫీకి బదులుగా హెర్బల్ టీ, కొబ్బరి నీరు, పుదీనా టీ తాగవచ్చు.

ఉప్పు

మితిమీరిన ఉప్పు తీసుకోవడం కూడా మీ మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఉప్పు శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, ఇది మీలో అధిక రక్తపోటును కలిగిస్తుంది. అలసట కలిగిస్తుంది, మానసిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది.

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు

వైట్ బ్రెడ్, వైట్ రైస్, చక్కెర, సిరప్, మిఠాయి ఆహారం, స్నాక్స్, పాస్తా, మైదాపిండితో చేసిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల గుండె, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తడంతో పాటు, మానసిక స్థితి దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండండి లేదా పరిమిత పరిమాణంలో తినండి. మానసిక ఆరోగ్య సంస్థలు నిర్వహించిన ఒక అధ్యయనంలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తినేవారిలో ఆందోళన, నిరాశకు గురయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని వెల్లడైంది.

చక్కెర కలిగిన ఆహారం

చక్కెర ఎక్కువ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను హెచ్చుతగ్గులు చేయడంతో పాటు మానసిక సమస్యలను కూడా కలిగిస్తాయి. ప్రిజర్వ్ చేసిన పండ్ల రసాలు, జామ్‌లు, కెచప్‌లు, సాస్‌లు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి, వీటిలో చక్కెర అధికంగా ఉంటుంది.

తదుపరి వ్యాసం