Food colors: ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఈ ముప్పు తప్పదు
16 February 2023, 16:45 IST
- Food colors: ఫుడ్ కలర్స్ వాడడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని తాజాగా ఒక అధ్యయనం తేల్చింది.
జీర్ణ వ్యవస్థను దెబ్బతీసే ఫుడ్ కలర్స్
ఆహార పదార్థాల్లో వినియోగించే ఫుడ్ కలర్స్ జీర్ణాశయ వ్యవస్థను దెబ్బతీస్తాయని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. కార్నెల్ అండ్ బింగమ్‌టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం జరిపారు. ఫుడ్ కలర్‌లో ఉండే మెటల్ ఆక్సైడ్ నానోపార్టికల్స్ పేగు వ్యవస్థను దెబ్బతీస్తాయని తేల్చారు.
‘ఫుడ్ కలర్స్‌లో ఉండే నిర్ధిష్ట నానోపార్టికల్స్ టైటానియమ్ డయాక్సైడ్, సిలికాన్ డయాక్సైడ్ జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని మేం కనుకొన్నాం..’ అని కార్నెల్ యూనివర్శిటీ ఫుడ్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎలాడ్ టాకో వివరించారు. ‘ముఖ్యమైన జీర్ణ, శోషణ ప్రోటీన్లపై అవి ప్రతికూల ప్రభావం చూపుతాయి..’ అని చెప్పారు.
రీసెర్చ్‌లో భాగంగా అధ్యయన బృందం టైటానియం డయాక్సైడ్, సిలికాన్ డయాక్సైడ్‌లను వినియోగించింది. శాస్త్రవేత్తలు నానోపార్టికల్స్‌ను కోడి గుడ్లలోకి ఇంజెక్ట్ చేశారు. గుడ్లు పొదిగి పిల్లలయ్యాక వాటి రక్తంలో మార్పులను గమనించారు. రక్తంలో మార్ఫోలాజికల్, మైక్రోబయల్ బయోమార్కర్లలో మార్పులను గుర్తించారు. అలాగే ఎగువ జీర్ణ వ్యవస్థ, పేగుకు అనుసంధానమై ఉండే సంచి లాంటి వ్యవస్థలో మార్పులను గుర్తించారు.
‘మనం రోజువారీగా ఈ నానోపార్టికల్స్‌ను వినియోగిస్తున్నాం..’ అని టాకో వివరించారు. ‘నిజానికి అవి మనం ఎంత వినియోగిస్తున్నామో మనకు తెలియదు. అలాగే దీర్ఘకాలంలో వీటి వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా తెలియదు. అయితే వీటి ప్రభావాలను మేం విశ్లేషించగలిగాం. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం గురించి అర్థం చేసుకోవడానికి వీలుపడింది..’ అని వివరించారు.
అయితే నానోపార్టికల్స్ వల్ల దుష్ప్రభావాలను గుర్తించినప్పటికీ వాటిని వినియోగించడం ఆపాలని శాస్త్రవేత్తలు నిర్ధిష్టంగా సూచించలేదు.
‘ఇప్పుడు ఈ అధ్యయనంలో తేలిన సమాచారం ఆధారంగా వీటిపై అవగాహన కలిగి ఉండాలని మేం సూచిస్తున్నాం..’ అని టాకో చెప్పారు. ‘మేం కనుగొన్న విషయాలపై శాస్త్రీయంగా మరింత లోతైన పరిశోధన జరగాలి. తాజా అధ్యయనం చర్చకు వీలు కల్పిస్తుంది..’ అని వివరించారు.
టాపిక్