Natu Kodi Sambar । నోరూరించే నాటుకోడి సాంబార్.. నంజుకు తినేయాలనిపిస్తుంది, రెసిపీ చూడండి!
17 November 2022, 23:06 IST
- నాటుకోడితో సాంబార్ చేసుకొని తింటే మటన్ పాయా సూప్ తిన్నంత తృప్తిగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో Natu Kodi Sambar Recipe ఇక్కడ ఉంది.
Natu Kodi Sambar Recipe
కోడికూర అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఎవరు ఉంటారు. దమ్ బిర్యానీ అయినా ముర్గ్ ముసల్లం అయినా, ఎర్రటి కారం- మసాలా పట్టుకొని ఉన్న కోడి లెగ్ పీస్‌ను కొరికి తింటే ఆ సుఖమే వేరు. ఇక నాటుకోడి ఉంటే ఏమీ మిగిల్చకుండా నాకి తినేయాలనిపిస్తుంది, నాటుకోడి రుచి ఫింగర్ లికింగ్ గుడ్ అని చెప్తున్నాం. మనకు నాటుకోడి కూర అనగానే తెలంగాణలోని అంకాపూర్ గుర్తుకొస్తుంది. అక్కడ నాటుకోడిని శుభ్రంగా కడిగి, ఒళ్లంతా పసుపు పూసి, ఆపై బాగా కాల్చి, అనంతరం ముక్కలుగా కట్ చేసి, ఉప్పుకారం మసాలాలు అన్ని వేసి సన్నని సెగమీద వండుతారు, ఆ రుచి మరొక చోట దొరకదు.
అయితే మనకు నాటుకోడి కూర గురించే తెలుసు, నాటుకోడి సాంబార్ ఎప్పుడైనా తిన్నారా? తెలంగాణ ప్రాంతంలోనే పప్పుతో కోడికూరను కలిపి వండే దాల్చా అనే వంటకం ఉంటుంది. కానీ ఈ నాటుకోడి సాంబార్ అనేది కర్ణాటక రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి. బెంగళూరు, మాండ్య, మైసూర్, హాసన్ ప్రాంతాల్లో రాగిముద్ద- నాటుకోడి సాంబార్ లేని విందు భోజనం అంటూ ఉండదు.
మరి అదే స్టైల్లో మీరు కూడా నాటుకోడి సాంబార్ వండుకోవాలనుకుంటే ఇక్కడ రెసిపీ అందిస్తున్నాం చూడండి.
Natu Kodi Sambar Recipe కోసం కావలసినవి
- నాటుకోడి చికెన్ - 1 కిలో
- కొబ్బరి - 1/2 కప్పు
- నూనె - 1/2 కప్పు
- ఉల్లిపాయలు - 5
- టమోటాలు - 2 (ఐచ్ఛికం)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
- పసుపు - 1/2 టీస్పూన్
- నల్ల మిరియాల పొడి - 1 టీస్పూన్
- జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- గసగసాలు - 1 టేబుల్ స్పూన్
- చిక్ పీస్ - 1/2 కప్పు
- కొత్తిమీర - 1 కట్ట
- ఉప్పు - రుచి ప్రకారం
నాటుకోడి సాంబార్ ఎలా తయారు చేయాలి
- ముందుగా చికెన్‌ను 3-4 సార్లు శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోండి.
- మరోవైపు, ఒక పాత్రలో నూనె వేయించి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి.
- ఆ తర్వాత మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి 30 సెకన్లు వేయించి, 1 కప్పు నీళ్లు పోసి మరిగించాలి.
- మిశ్రమం నుంచి నూనె పైకి తేలుతున్న సమయంలో చికెన్ ముక్కలు 5-10 నిమిషాలు వేయించాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి,
- ఇప్పుడు సాంబార్ పొడి వేసి బాగా కలిపేసి, 1 లీటరు నీరు పోసి మూతపెట్టి 20 నిమిషాల పాటు ఉడికించాలి.
- మరొక గిన్నెలో చిక్‌పీస్‌ని రెండు నిమిషాలు వేయించి, మిక్సీలో వేసి కొన్ని నీళ్లతో రుబ్బుకోవాలి. తర్వాత ఈ పేస్టును చికెన్ మిశ్రమంతో కలపాలి.
- అలాగే గసగసాలు, పచ్చి శెనగలు, కొత్తిమీర తరుగు, కొబ్బరి, టొమాటోలను మిక్సీలో వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడ ఉడికే చికెన్ లో వేసుకోవాలి.
- ఇప్పుడు కొన్ని నీరు పోసి, ఉప్పు సర్దుబాటు చేసుకొని 10-15 నిమిషాలు మళ్లీ మరిగించండి. లేదా 3-4 విజిల్స్ వరకు కుక్కర్లో ఉడికించాలి.
అంతే, నాటుకోడి సాంబార్ రెడీ. దీనిని రాగి సంకటి, అన్నం, చపాతీలతో తినవచ్చు. ఈ నాటుకోడి సాంబార్ కూడా మటన్ పాయా లాగా రుచికరంగా ఉంటుంది.