నల్ల కోడి..నాటు రుచి! కడక్‌నాథ్ చికెన్‌తో మగవారిలో అదనపు సామర్థ్యం
28 February 2022, 20:05 IST
- చూడటానికి నల్లగా, ఉంటాయి కానీ, వీటిని పట్టి, ఉప్పు-కారం బాగా దట్టించి సన్నని సెగ మీద బాగా వేయించుకొని తింటే ఆహా స్వర్గం. రుచితో పాటు ఆరోగ్యం గ్యారెంటీ అని తిన్నవాళ్లు చెబుతున్నారు. మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయని కొంత మంది న్యూట్రిషన్లు వారి రీసెర్చిలో భాగంగా వెల్లడించారు.
Kadaknath Chicken
కలిమసి లేదా కడక్‌నాథ్ అనేది ఒక ప్రత్యేకమైన కోడి జాతి, ఇది నలుపు రంగులో ఉంటుంది. అంతేకాదు దీని మాంసం కూడా నల్లగా మాడిపోయినట్లు ఉంటుంది. ఈ కోడిలోని చాలా అవయవాలు అలాగే ఎముకలు కూడా నల్లగా ఉంటాయి, కనీసం ఇది పెట్టే గుడ్లైనా తెల్లగా ఉంటాయంటే అదీ కాదు, ఈ కోడి గుడ్లు కూడా నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. మనదేశంలో ఇలాంటి కోళ్లు మొట్టమొదటి సారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనుల ఆధిపత్యం కలిగిన ఝబువా జిల్లాలో కనుగొన్నారు.
ఈ కోడి శరీరంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల దానికి ఆ రంగు వచ్చినట్లు అధ్యయనాలు నిరూపించాయి. మామూలుగా నాటుకోడి రుచే వేరు అందులో కడక్ నాథ్ చికెన్ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. అంతేకాదు, ఈ రకం చికెన్‌లో 25-27 శాతం ప్రోటీన్ కంటెంట్, తక్కువ కొలెస్ట్రాల్ (0.73-1.03 %) ఉండటంతో ఊబకాయం లాంటి సమస్యలు తలెత్తవు. ఈ కడక్ నాథ్ చికెన్ అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నాయనే ప్రచారం ఉంది.
సంతానోత్పత్తికి తోడ్పాటు..
కడక్‌నాథ్ చికెన్ తినడం ద్వారా ఇందులో ఉండే పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడమే కాకుండా, శ్వాససంబంధమైన ఆస్తమా లాంటి రోగాలను నియంత్రణలో ఉంచుతుందంట. గర్భిణీలకు ప్రసవం సమయంలో కలిగే కొన్ని సమస్యలను ఇది దూరం చేయడం అలాగే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయని కొంత మంది న్యూట్రిషన్లు వారి రీసెర్చిలో భాగంగా వెల్లడించారు. దీంతో ఈ రకం కోళ్లకు దేశవ్యాప్తంగా విపరీతమైన ప్రచారం వచ్చింది.
ఇప్పుడు చాలా చోట్ల కడక్ నాథ్ కోళ్ల పెంపకం లాభదాయకమైన వ్యాపారంగా మారింది. మన దగ్గర కూడా ఈ కోళ్ళను పెంచుతున్నారు.
ధర ఎక్కువే..
డిమాండ్ బాగా ఉండటంతో దీని ధర సీజన్‌ను బట్టి కేజీకి రూ. 900 నుంచి రూ. 1,300 వరకు ఉంటుంది. చూడటానికి నల్లగా, ఉంటాయి కానీ, వీటిని పట్టి, ఉప్పు కారం బాగా దట్టించి సన్నని సెగ మీద బాగా వేయించుకొని తింటే ఆహా స్వర్గం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం గ్యారెంటీ అని తిన్నవాళ్లు చెప్తున్నారు. మీరూ ఓ సారి కడక్ నాథ్ కోడిని కుమ్మేయండి మరి.
టాపిక్