Sinusitis: వేడివేడి చికెన్ సూప్‌తో సైనస్ సమస్య దూరం, ఇంకా ఏం చేయాలో తెలుసుకోండి
28 February 2022, 17:44 IST
- ప్రాథమిక దశలో సైనసైటిస్ సమస్యను అధిగమించేందుకు ఇంటి వద్ద నుంచే నయం చేసుకునే కొన్ని విధానాలు అనుసరించి ప్రయత్నం చేయవచ్చు. ముక్కులోపల మ్యూకస్ నిండిపోతే ఈ సమస్య తలెత్తుతుంది, అది తొలగించుకుంటే సమస్యకు పరిష్కారం లభించినట్లే.
Sinus
సైనస్ లేదా సైనసిటిస్ అనేది నాసికా రంధ్రాలు దట్టంగా మారి, నాసికా రంధ్రాల చుట్టూ ఉన్న కావిటీస్ మంటగా మారే పరిస్థితి. తలనొప్పి, ముఖంలో మంట, ముక్కు కారడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా చలి వాతావరణం, దుమ్ము వల్ల కలిగే అలర్జీల ద్వారా ఈ సమస్య ఏర్పడుతుంది. చాలావరకు సైనస్ దానంతటదే తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగితే దీర్ఘకాలికాలికమైన సైనసిటిస్ సుమారు ఎనిమిది వారాల వరకు వేధిస్తుంది.
తీవ్రమైన సైనసిటిస్‌కు పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ అవసరం కావచ్చు. వీటితో ఫలితం లేకపోతే నాసికా డీకోంగెస్టెంట్లు, నాసికా సెలైన్ రిన్సెస్‌తో లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అయితే ప్రాథమిక దశలో ఈ సమస్యను అధిగమించేందుకు ఇంట్లోనే కొన్ని విధానాలు అనుసరించవచ్చు. ముక్కులోపల మ్యూకస్ నిండిపోతే ఈ సమస్య తలెత్తుతుంది, అది తొలగించుకుంటే సమస్యకు పరిష్కారం లభించినట్లే. కాబట్టి కింద చెప్పిన చిట్కాలు పాటించి చూడండి.
ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోండి
సమృద్ధిగా నీరు, పండ్ల రసాలు, హెర్బల్ టీలు, కొంచెం స్పైసీగా ఉండే ఇతర ద్రవాలను త్రాగండి. అలాగే హ్యూమిడిఫైయర్ లేదా ఆవిరి కారకాన్ని అమలు చేయండి. ఎందుకంటే అధికంగా లిక్విడ్స్ తీసుకోవడం ద్వారా తేమ శ్లేష్మం పలుచబడేలా చేసి అవి మీ సైనస్‌లను హరించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి.
నాసికా ప్రవాహ విధానం
ఇది ముక్కు రంధ్రాల్లో ఒక ప్రవాహాన్ని ఏర్పర్చడం లాంటిది. దీనిని మెడికల్ షాపులలో లభించే ప్రత్యేక స్క్వీజ్ సీసాలు, బల్బ్ సిరంజిలు లేదా నేటి పాట్‌తో చేయవచ్చు. నేటి పాట్ అనేది అల్లాదీన్ దీపంలా కనిపించే ఒక ఉపకరణం. అందులో సెలైన్ మిశ్రమం ప్యాక్ చేసి ఉంటుంది.
ముక్కులోకి సెలైన్ స్ప్రేతో వాష్ చేయడం ద్వారా అది శ్లేష్మాన్ని తొలగించేస్తుంది. మీకు సెలైన్ స్ప్రే అందుబాటులో లేకపోతే ఒక అరకప్పు కప్పు శుద్ధమైన నీటిలో అరచెంచా ఉప్పు, బేకింగ్ సోడా సమపాళ్లలో కలిపితే ఆ మిశ్రమాన్ని స్ప్రే లాగా వాడవచ్చు. రోజుకి రెండు లేదా మూడు సార్లు నాసికా రంధ్రాల గుండా ఈ ద్రావణాన్ని స్ప్రే చేయడం ద్వారా ముక్కు తెరుచుకుంటుంది.
ఆవిరి పట్టడం, వేడి కాపడం
ఈ విధానం మన ఇళ్లలో చాలా పాపులర్. జలుబు చేసినపుడు, గొంతు కూర్చున్నప్పుడు ఎలా అయితే ఆవిరి పట్టుకుంటామో అలాగే చేయాలి. ఈ ఆవిరిలో కొద్దిమొత్తంలో స్పైసెస్ కలుపుకోవడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. పుదీన, వెల్లుల్లి, యూకలిప్టస్ గుణాలు సుగంధ నూనెలు, ద్రావణాలు పీల్చటం కూడా చేయవచ్చు.
దీనితో పాటు సైనస్ కారణంగా మంటగా ఉంటుంది కాబట్టి ఒక గుడ్డను వేడి చేసి ఆ వెచ్చదనాన్ని మొఖంపై అద్దడం చేయాలి. మరోసారి చల్లని గుడ్డతో ముఖంపై రుద్దాలి. మార్చి మార్చి ఇలా రెండు, మూడు సార్లు చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
చికెన్ సూప్
ఇది కూడా మనకు తెలిసిందే, ఎంతో ఇష్టమైన రుచికరమైన చిట్కా కూడా. చారానా కోడికి బారానా మసాల నూరి సూప్ చేస్తాం కాబట్టి వేడివేడి కోడికూర సూప్ స్వీకరించడం ద్వారా అందులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగిన ఆవిరి సైనస్‌లను క్లియర్ చేయడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో నిరూపితమైంది.
వీటన్నింటితో పాటు తగినంత విశ్రాంతి తీసుకుంటే సైనస్ సమస్య మాయమవుతుంది. అయితే ఎన్ని చేసినా సమస్య తగ్గకుండా జ్వరం రావడం, ఆకుపచ్చ శ్లేష్మం, దృష్టిలో మార్పులు, ఉబ్బసం లేదా ఇతర ఔషధాల వల్లే తల్లెత్తే సైడ్ ఎఫెక్ట్స్ కలిగితే వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స పొందాలి.