Mutton Paya Soup । మటన్ పాయా.. జీర్ణవ్యవస్థ మెరుగు పరుస్తుంది, పోషకాలను అందిస్తుంది!
02 November 2022, 15:16 IST
- Mutton Paya Soup: ఆదివారం తిన్న మటన్ అరగకపోతే ఆ తర్వాత మటన్ పాయా సూప్ తాగి చూడండి. జీర్ణవ్యవస్థ శుభ్రం అవుతుంది, మంచి పోషణ కూడా లభిస్తుంది. రుచికరంగా మటన్ పాయా సూప్ ఎలా చేయాలో Mutton Paya Soup Recipe ఇక్కడ తెలుసుకోండి.
Mutton Paya Soup Recipe
ఈ మధ్య కాలంలో చాలా మందికి కడుపు సంబంధింత సమస్యలు తలెత్తడం సర్వసాధారణం అయింది. ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతున్నారు. శరీరానికి అలవాటు లేని ఆహారాన్ని తినడం, అతిగా తినడంతో పాటు శారీరక శ్రమ అనేది లేకపోవడం వలన ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కొవ్వు పదార్ధాలు, మైదా, చక్కెరతో పాటుగా అప్పటికప్పుడు తయారుచేసి ఇచ్చే ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వలన అవి, మీ పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు భంగం కలిగిస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మందగించి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సరైన జీర్ణక్రియ పునరుద్ధరించడం ముఖ్యం. అందుకు మన శరీరాన్ని, కడుపును డీటాక్స్ చేయాలి. డీటాక్స్ అంటే మన శరీరంలో ఉండి పోయిన మలినాలను తొలగించడం.
మన పేగులు కొన్ని లక్షల కోట్ల సూక్ష్మజీవులకు నిలయం. అవి జీర్ణక్రియ ప్రక్రియ, జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు పేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధికి కారణం అవుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అదే సమయంలో మీ శరీరానికి సరైన పోషకాలను సరఫరా చేస్తాయి.
పోషకాహార నిపుణురాలు అవంతి దేశ్‌పాండే శరీరాన్ని డీటాక్స్ చేసి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి పోషకాలతో నిండిన సూప్‌లు తాగవచ్చని సూచించారు. ఇందులో మాంసాహారులకు బాగా ఇష్టమైన పాయా సూప్ కూడా ఉంది. శాకాహారులైతే ఏదైనా మష్రూమ్-క్యారెట్ సూప్ లేదా బీట్‌రూట్ గంజి తాగవచ్చునని సూచించారు. మరి ఇందులో చాలా మందికి ఫేవరెట్ అయిన పాయా సూప్ ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం చూడండి.
Mutton Paya Soup Recipe కోసం కావలసినవి
- ల్యాంబ్ ట్రాటర్స్ (మేక కాళ్లు) 150-200 గ్రా (5-6 PC లు)
- సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1 కప్పు
- తరిగిన వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
- అల్లం - ½ అంగుళం
- బిరియాని ఆకులు - 2
- పచ్చి ఏలకులు - 2
- దాల్చిన చెక్క - 1
- జాపత్రి - 1
- లవంగాలు - 2
- కొత్తిమీర కాండం, ఆకులు - 2 టేబుల్ స్పూన్లు
- కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె - 1 టేబుల్ స్పూన్
- రుచికి తగినట్లుగా ఉప్పు, నల్ల మిరియాల పొడి
- నీరు- 500-650 మి.లీ
మటన్ పాయా సూప్ రెసిపీ- తయారీ విధానం
- ముందుగా ప్రెజర్ కుక్కర్‌లో నూనె వేడి చేసి, మసాలా దినుసులను వేయించండి. అవి సువాసన వచ్చిన తర్వాత, తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం వేసి వేయించాలి. తర్వాత లాంబ్ ట్రోటర్స్ వేసి తక్కువ వేడి మీద వేయించాలి.
- ఆ తర్వాత ఉప్పు, మిరియాలు, నీరు వేసి బాగా కలపాలి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
- స్ట్రైనర్‌తో కంటెంట్‌లను వడకట్టండి.
- సర్వింగ్ బౌల్‌లో సూప్‌ను పోసి, తాజా నిమ్మరసం పిండండి.
- అంతే రుచికరమైన నోరూరించి పాయాసూప్ రెడీ, వేడిగా వేడిగా సిప్ చేస్తూ దీని రుచిని ఆస్వాదించండి. మీరు కావాలనుకుంటే, మటన్ పాయాలో మీకు నచ్చిన కూరగాయల ముక్కలను కలుపుకోవచ్చు.
ఈ మటన్ పాయా సూప్ సహజ కొల్లాజెన్‌ను కలిగి ఉంటుంది, ఇది ప్రేగు ఆరోగ్యాన్ని వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఈ శీతాకాలంలో దగ్గు, జలుబుల నుంచి ఉపశమనం కోసం మటన్ పాయా సూప్ రుచికరమైన, అత్యుత్తమ హోం రెమెడీ అని చెప్పవచ్చు. ఇది ఎంతో బలవర్థకమైనది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరి ఇంకేం తిన్నది అరగకపోతే మటన్ పాయా సూప్ తాగేయండి, అంతా సెట్ అవుతుంది.