తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Morning Routine । మీ దినచర్యను ఇలా ప్రారంభించండి, రోజంతా చురుగ్గా ఉంటారు!

Healthy Morning Routine । మీ దినచర్యను ఇలా ప్రారంభించండి, రోజంతా చురుగ్గా ఉంటారు!

HT Telugu Desk HT Telugu

09 March 2023, 9:04 IST

google News
    • Healthy Morning Routine: రోజంతా చురుకుగా ఉండాలంటే ఉదయం పూట మీరు తీసుకునే చర్యలే పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యకరమైన ఉదయపు దినచర్య కోసం కొన్ని చిట్కాలు ఇక్కడ చూడండి.
Healthy Morning Routine
Healthy Morning Routine (Unsplash)

Healthy Morning Routine

Healthy Morning Routine: రోజంతా యాక్టివ్‌గా ఉండటం అందరికీ సాధ్యం కాదు, ఉదయం లేచినా దగ్గర నుంచి ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతారు, వృత్తిపరమైన ఒత్తిళ్ళు, వ్యక్తిగత ఆందోళనలతో రోజును గడుపుతూ ఉంటారు. సమయం గడిచేకొద్దీ శక్తి తగ్గిపోతుంది, ఆ తర్వాత నీరసించిపోతారు. కానీ, మీ దినచర్యను సరైన విధానంలో ప్రారంభిస్తే, రోజంతా ఉత్సాహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మీరు రోజంతా ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే అందుకు ఉదయం పూట మీరు తీసుకునే చర్యలే పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. మీలో శక్తిని పెంచడానికి, అలసటను నివారించడానికి మీరు మీ దినచర్యలో కొన్ని చిన్న సర్దుబాట్లు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఉదయపు దినచర్య కోసం మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ చూడండి.

1. ఒక గ్లాసు నీటితో రోజును ప్రారంభించండి

ఉదయం లేవగానే ఒక గ్లాసు నీటిని తాగండి. ఈ అలవాటు కచ్చితంగా ఉదయం మీ దినచర్యగా ఉండాలి. నీరు మీకు ఉత్తేజకరమైన ప్రారంభాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇది శరీరంలో పోషకాల ప్రసరణలో సహాయపడుతుంది. నీరు శరీరానికి రవాణా వ్యవస్థగా పనిచేస్తుంది. నీరు త్రాగిన 20 నిమిషాల తర్వాత ఒక పండు లేదా గుప్పెడు నట్స్ తినండి.

2. ఆరోగ్యకరమైన అల్పాహారం

నిద్రలేచిన మొదటి గంటలోపు ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి. అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం, కాబట్టి ఆరోగ్యకరమైన అల్పాహారం తినండి. మనకు 60% కేలరీలు ఈ అల్పాహారం నుంచే రావాలి. కాబట్టి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మిళితం అయి ఉన్న అల్పాహారం తీసుకోవాలి. పెసరట్టు, ఇడ్లీ, గోధుమ కూరగాయ ఉప్మా, వెజిటబుల్ దోశ, గుడ్లు వంటివి తీసుకోవచ్చు. అల్పాహారం తీసుకోవడానికి సరైన సమయం ఉదయం 7 గంటలు లేదా నిద్ర లేచిన మొదటి గంటలోపు.

3. ఉదయం వ్యాయామం

ఉదయం పూట మనకు సమయం ఉండదు, అయినప్పటికీ కనీసం 15 నిమిషాల వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నించండి. ఉన్నచోటనే స్పాట్ జాగింగ్, ప్లాంక్‌లు, స్క్వాట్‌లు లేదా కొన్ని సూర్య నమస్కారాలు వంటి సాధారణమైన వ్యాయామాలు చేయవచ్చు.

4. బ్రేక్స్ తీసుకోండి

మీరు రోజంతా నిర్విరామంగా పనిచేయడం వలన శక్తిని కోల్పోవచ్చు. కాబట్టి చిన్నచిన్న విరామాలు తీసుకుంటూ ఉండండి. కొద్దిసేపు నడవడం, ఒళ్ళు విరవడం లేదా మీ కళ్ళు మూసుకుని లోతుగా ఊపిరి పీల్చుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి, మీరు ఫోకస్ పెట్టడానికి సహాయపడుతుంది. మీరు చాలా సమయం పాటు డెస్క్ వద్ద పని చేస్తే ఇది చాలా ముఖ్యమైనది.

5. మీ రోజును సహేతుకంగా ప్రారంభించండి

రోజంతా శక్తివంతంగా ఉండటానికి ఉత్తమ మార్గాలలో ఒకటి మీ రోజును సరిగ్గా ప్రారంభించడం. దీని అర్థం మీరు రాత్రి తగినంత నిద్ర పోయి, ఉదయాన్నే సహేతుకమైన సమయంలో మేల్కొలపడం. కాబట్టి మీరు రోజంతా చురుగ్గా ఉండాలంటే, రాత్రంతా సరిగ్గా నిద్రపోయి ఉండాలని గ్రహించండి. ధ్యానం చేయడం, ఒత్తిడిని నియంత్రించడం, సరైన రాత్రి దినచర్యను కలిగి ఉండటం ద్వారా సరిగ్గా నిద్రపోగలరు.

తదుపరి వ్యాసం