Cold Soups for Summer । వేసవిలో చల్లని సూప్‌లు, లంచ్‌లో తాగితే ఎంతో మేలు!
19 March 2023, 13:15 IST
- Cold Soups for Summer: చలికాలంలో వెచ్చని సూప్‌లను ఎలా అయితే తాగుతామో, ఎండాకాలంలో చల్లని సూప్‌లను తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు
Cold Soups for Summer
Cold Soups for Summer: వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ వేడి సీజన్ లో ఘన పదార్థాల కంటే చల్లని పానీయాలు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు, డీహైడ్రేషన్ నివారించేందుకు నీరు, పండ్ల రసాలు, ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం చాలా అవసరం. అయితే వీటితో పాటు శరీరానికి సరైన పోషకాలు అందాలంటే సూప్‌లు తప్పకుండా తీసుకోవాలి. చలికాలంలో వెచ్చని సూప్‌లను ఎలా అయితే తాగుతామో, ఎండాకాలంలో చల్లని సూప్‌లను తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం సమయంలో తీసుకునే ఒక చల్లని సూప్ మీ శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలాంటి సూప్ రెసిపీలను ఇక్కడ తెలుసుకోండి.
Beetroot Yoghurt Soup Recipe కోసం కావలసినవి
- 1 బీట్‌రూట్
- 1 కప్పు పెరుగు
- 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
- 1/4 టీస్పూన్ మిరియాల పొడి
- ఉప్పు రుచికి తగినంత
- 2-3 పుదీనా ఆకులు
- కొన్ని కొత్తిమీర ఆకులు
- అవసరమైనంత నీరు
బీట్‌రూట్ మజ్జిగ సూప్ తయారీ విధానం
- ముందుగా బీట్‌రూట్‌ను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసుకోండి. ఆపై ఈ ముక్కలను మిక్సర్ జార్ లోకి తీసుకొని, కొన్ని నీళ్లు కలిపి మృదువైన మిశ్రమాన్ని తయారు చేయండి.
- అనంతరం పెరుగును మజ్జిగలా చిలకండి, ఆపైన మజ్జిగని బీట్‌రూట్ మిశ్రమంతో కలపండి.
- అందులో పైన పేర్కొన్న మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర ఆకులు, కొద్దిగా ఉప్పువేసి బాగా కలపండి.
- ఇప్పుడు ఈ పానీయాన్ని రీఫ్రజరేటర్ లో కొద్ది సమయం ఉంచి చల్లబరచండి.
అంతే, బీట్‌రూట్ మజ్జిగ సూప్ రెడీ.
Cucumber Cilantro Soup Recipe
వేసవి తాపాన్ని అధిగమించడానికి దోసకాయ కొత్తిమీర సూప్ ఒక రిఫ్రెషింగ్ పానీయం. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రెండు దోసకాయలను తొక్క తీసి, ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే అర కప్పు కొత్తిమీర, చిన్న జాలపెనో మిరపకాయ ముక్క, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, 1/4 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక కప్పు గడ్డ పెరుగును తీసుకోండి. అన్నింటిని మిక్స్ చేసేయండి. రుచికోసం మిరియాల పొడి, ఉప్పు కలుపుకోండి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరచండి. మధ్యాహ్నం లంచ్ సమయంలో ఈ సూప్ ను ఆస్వాదించండి. ఈ రెసిపీని చెఫ్ రీతు ఉదయ్ కుగాజీ అందించారు.