Phone Side Effects : నిద్ర లేవగానే స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా?
23 April 2023, 8:15 IST
- Smart Phone Side Effects : నిద్ర లేవగానే చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తారు. టెక్స్ట్ సందేశాలు పంపడం నుండి సోషల్ మీడియా బ్రౌజింగ్ లేదా వార్తలు చదవడం వరకు ఫోన్లోనే ఉంటారు. కానీ ఇది చాలా డేంజర్.
స్మార్ట్ ఫోన్ సమస్యలు
ఎక్కువ మంది నిద్రలేచిన వెంటనే స్మార్ట్‌ఫోన్‌లలో(Smart Phone) మునిగిపోతారు. దాదాపు 80 శాతం మంది నిద్రలేచిన 15 నిమిషాల్లోనే తమ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం మెుదలుపెడుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక చాలా పనులు ఈజీగా అయిపోతున్నాయి.. కానీ నిద్రలేచిన వెంటనే స్మార్ట్ ఫోన్ వాడే అలవాటును మానుకోవాలి. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే వాడటం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
మనం ఉదయం మేల్కొన్నప్పుడు, మన స్మార్ట్‌ఫోన్‌లలో మన ఇమెయిల్‌లను తనిఖీ చేయవచ్చు లేదా మన రోజువారీ ప్రణాళికలను చూసుకోవచ్చు. ఇవన్నీ మన మనస్సును ప్రభావితం చేస్తాయి. ఇవి మన రోజును శాంతియుతంగా ప్రారంభించకుండా ఆందోళన, ఒత్తిడి(Stress)తో ప్రారంభించేలా చేస్తాయి.
స్మార్ట్‌ఫోన్‌ల విపరీతమైన వినియోగం చాలా మంది యువతీ యువకుల నిద్రపై ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా, వారు డిప్రెషన్(Depression)లో ఉన్నారని స్వీడన్‌లో జరిపిన ఒక అధ్యయనంలో తేలింది.
నిద్రలేచిన తర్వాత స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల మెదడు(mind) మీద ప్రభావం చూపిస్తుంది. మెదడుపై ఒత్తిడిని కలిగిస్తుంది. మనం సోషల్ మీడియా(Social media)లో మునిగిపోయినప్పుడు, మన మెదడు డోపమైన్‌ను విడుదల చేస్తుంది. అలా స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటు పడిపోతున్నాం. వాటర్‌లూ యూనివర్శిటీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో పుస్తకాలు చదివే వారి కంటే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే ఆలోచనల్లో బద్ధకంగా ఉంటారని సూచిస్తున్నారు.
ఉదయం లేవగానే మనం చేసే మొదటి పని సోషల్ మీడియాలోకి లాగిన్ అవ్వడం. ఇది మెల్ల మెల్లగా 30 నిమిషాలను తీసుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా గంట అవుతుంది. తరువాత మన దృష్టి మరల్చబడుతుంది. ఈ కారణంగా ఉదయం చేయాల్సిన పనులను వాయిదా వేస్తాం.
ఉదయాన్నే నిద్రలేవడానికి స్మార్ట్‌ఫోన్‌లో అలారం(Alaram) పెట్టుకునే బదులు వాచ్‌లో పెట్టుకుంటే మంచిది. ఉదయం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం మానుకోండి. నీరు ఎక్కువగా తాగండి, వ్యాయామం చేయండి లేదా ధ్యానం చేయండి. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగానికి ఉదయం పూట దూరంగా ఉంచండి. మన జీవితంలో స్మార్ట్‌ఫోన్‌లు అనివార్యమైనవి. కానీ దాని వాడకాన్ని తగ్గించడం, దుష్ప్రభావాలను తగ్గించడం మన చేతుల్లోనే ఉంది. స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల మెడ సమస్యలు, చూపు మసకబారడం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం మన రోజును ఎలా ప్రారంభిస్తామో.. రోజంతా అలానే ఉంటుంది. అందుకే ఉదయంపూట స్మార్ట్ ఫోన్ వాడటం మానేయండి.
టాపిక్