Smartphone Addiction । స్మార్ట్‌ఫోన్‌తోనే కాలాన్ని గడిపేస్తున్నారా? వ్యసనాన్ని వదిలించుకోండి ఇలా!
Smartphone Addiction: పొద్దున లేచిన దగ్గర్నించీ, రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా? దీనినే స్మార్ట్‌ఫోన్ వ్యవసం అంటారు. దీని నుంచి ఎలా బయటపడాలో మార్గాలు చూడండి.
డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారింది. కేవలం ఫోన్ కాల్స్ చేయడం, మెసేజులు పంపడం మాత్రమే కాకుండా, వార్తలు చూడటం, ఈమెయిల్‌లను పంపడం, సోషల్ మీడియాను స్క్రోలింగ్ చేయడం, వీడియోలు చూడటం, ఆహారాన్ని ఆర్డర్ చేయడం ఇలా ప్రతీ అవసరానికి స్మార్ట్‌ఫోనే దిక్కయింది. చేతిలో ఫోన్ లేకపోతే జీవితమే లేదు అన్నట్లుగా పరిస్థితి దిగజారింది. స్మార్ట్‌ఫోన్ అనే వ్యసనం ఇప్పుడు మనుషులు మానసిక, శారీరక ఆరోగ్యం తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
ఒక అధ్యయనం ప్రకారం, సగటున ఒక వ్యక్తి రోజుకు 2,617 సార్లు ఫోన్‌ను తాకుతున్నాడు, సగటున ప్రతీ 3 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూస్తూ గడుపుతున్నాడు. పెరిగిన స్క్రీన్ టైమ్ కారణంగా కంటిచూపును కోల్పోతున్నవారు లేకపోలేదు.
Ways To Break Smartphone Addiction- స్మార్ట్‌ఫోన్ వ్యసనం వదిలించుకునే చిట్కాలు
స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటికిప్పుడే మనం పూర్తిగా వదిలించుకోలేకపోయినప్పటికీ, ఈ వ్యసనాన్ని అధిగమించడానికి, మన జీవితంపై మనకు ఒక నియంత్రణను కలిగి ఉండటానికి కొన్ని వ్యూహాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడవచ్చు. అవేమిటో తెలుసుకోండి.
మీకు దగ్గరగా ఫోన్‌ను ఛార్జ్ చేయవద్దు
మీ ఫోన్‌ను మీకు దూరంగా ఛార్జింగ్ పెట్టండి. ఇది ఆ కొద్దిసేపయినా మిమ్మల్ని ఫోన్‌కు దూరంగా ఉంచుతుంది. అలాగే రాత్రిపూట కూడా ఛార్జింగ్ పెట్టకండి. చాలామంది రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టేసి, రోజంతా దానిని ఉపయోగిస్తారు. రాత్రి అలాగే ఉంచి ఉదయం మీరు మీ దినచర్య ప్రారంభించినపుడు ఛార్జింగ్ పెట్టుకోండి.
మీ పడకకు దగ్గర ఫోన్ వద్దు
మీరు నిద్రపోయేటపుడు ఫోన్‌ను దూరంగా ఉంచి పడుకోండి. ఇది మీకు ప్రశాంతమైన నిద్రను అందించడమే కాకుండా, ఉదయం వేళ మీ సమయాన్ని అనవసరంగా వృధా కానివ్వదు.
నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి
నోటిఫికేషన్‌లు పెద్ద తలనొప్పి. కొన్ని యాప్స్ నిరంతరం నోటిఫికేషన్‌లను పంపిస్తూనే ఉంటాయి. దీంతో మీరు వాటిని చూస్తూనే కాలం గడుపుతారు. నోటిఫికేషన్ అలర్టులను, అనవసరపు రింగ్ ఆఫ్ చేస్తే మీరు చాలా సమయం ఆదా చేసినవారు అవుతారు. అనవసరపు సౌండ్లు రాకుండా సెట్టింగ్స్ మార్చండి. అనవసరపు మార్కెటింగ్ కాల్స్ రాకుండా 'డు నాట్ డిస్టర్బ్' సెట్టింగ్స్ ఆన్ చేయండి. స్క్రీన్ బ్రైట్నైస్ కూడా తగ్గించండి.
మీ ఆత్మీయులతో సమయాన్ని గడపండి
స్మార్ట్‌ఫోన్ పక్కనబెట్టి మీ కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడండి. ఏదైనా మంచి విషయాలు చర్చించండి. కలిసి భోజనం చేయండి. మీతో ఉండే వాళ్లను కూడా ఫోన్ దూరంగా పెట్టి మీతో మాట్లాడమని కోరండి. మీ పెంపుడు జంతువులతో కలిసి ఆడుకోండి.
ప్రత్యామ్నాయ మార్గాలు
మీ సమయాన్ని గడిపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడండి. ఏదైనా పుస్తకం తీసి చదవండి లేదా పెయింటింగ్ వేయండి మీకు నచ్చిన ఆర్ట్ వర్క్ చేయండి, మనసు ప్రశాంతంగా ఉండేందుకు కాసేపు ధ్యానం, యోగా వంటివి చేయండి. లేదా ఏదైనా వ్యాయామం చేయండి, నడకకు వెళ్లండి మీ అభిరుచికి తగినట్లుగా కొత్తగా ఏదైనా ప్రయత్నించండి.