Pop Culture | పాప్ కల్చర్ అంటే ఏంటో తెలుసుకోండి.. ట్రెండ్ సెట్ చేయండి!-all you need to know about pop culture ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  All You Need To Know About Pop Culture

Pop Culture | పాప్ కల్చర్ అంటే ఏంటో తెలుసుకోండి.. ట్రెండ్ సెట్ చేయండి!

Manda Vikas HT Telugu
May 23, 2022 02:09 PM IST

పాప్ కల్చర్ అనే పదం ఇటీవల కాలంగా ఎక్కువగా వినిపిస్తోంది. మరి పాప్ కల్చర్ అంటే ఏమిటి? దీనిని అర్థం చేసుకునేందుకు ఇక్కడ అందించిన సమాచారం మీకు ఉపయోగపడవచ్చు..

Pop culture
Pop culture (Unsplash)

ఇటీవల కాలంగా పాప్ కల్చర్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడ కల్చర్ అంటే మనకు తెలుసు సంస్కృతి అని అర్థం. సమాజంలో ఒక వర్గం అనుసరించే జీవన విధానం, వారి ఆచార వ్యవహారాలు, పాటించే ప్రమాణాలు, సంబంధాలు, వారసత్వంగా కొనసాగించే పద్ధతులు, పరిపాలన ఇవన్నీ సంస్కృతిలో భాగమే. 

సమాజంలోని కట్టుబాట్లకు అనుగుణంగా సాగించే పరిపూర్ణమైన జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచించవచ్చు. ఇది వారి అస్థిత్వాన్ని తెలియజేస్తుంది. వారి ఉనికిని కాపాడుకునేలా చేస్తుంది. భౌగోళికంగా అనేక చోట్ల వైవిధ్యమైన సంస్కృతులు ఉంటాయి. భాష, వస్త్రధారణ, మత విశ్వాసాలు, కళలు, అభివాదాలు అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి.

సరే, ఇప్పుడు పాప్ కల్చర్ గురించి తెలుసుకుందాం. పాప్ కల్చర్‌ను పాపులర్ కల్చర్ అని కూడా అంటారు.  అంటే ఏదైనా ఒక ప్రదేశంలో జనాదరణ పొందిన ఆధునిక సంస్కృతి. ఒకరి అభిరుచులను అర్థం చేసుకొని, అలాంటి అభిరుచులు కలిగిన ఎంతో మందిని ఒకచోట చేర్చే వారధి పాప్ కల్చర్. 

సాధారణంగా ఈ పాప్ కల్చర్ అనేది ఏదైనా ఒక శక్తివంతమైన మీడియా ద్వారా ప్రజల్లోకి వ్యాప్తి చేసే సంస్కృతి. తద్వారా ఎక్కువ మంది దేనికైతే ఆకర్షితులవుతారో, అలాంటి కల్చర్‌ను వారి జీవనశైలిలో చేర్చడం.

ఎక్కువగా చర్చించే సంగీతం, సాహిత్యం, జానపదం, ఫ్యాషన్, నృత్యం, చలనచిత్రం, ఇతర ఏవైనా కళలు పాప్ కల్చర్‌లో భాగమే. ఆహారం నుంచి ఆహార్యం వరకు దేని గురించైనా ఇక్కడ చర్చించవచ్చు. ఈ పాప్ కల్చర్ ఒక మతానికో, కులానికో పరిమితమైనది కాదు.  అక్షరాలా ప్రజల సంస్కృతి. ఇది ఒక ప్రాంతానికి చెందిన సమాజంలో ప్రబలంగా ఉండే సాంస్కృతిక అంశాలను కలిగి ఉంటుంది.

నేటి స్మార్ట్ యుగంలో డిజిటల్ మీడియా ప్రజల్లో ఒక భాగం అయిపోయింది. పాప్ కల్చర్ అనేది విస్తరిస్తోంది. సోషల్ మీడియా ద్వారా లేదా ఇంకేదైనా మీడియం ద్వారా తమకు చెందిన భాషలోనే సమాచారాన్ని పొందుతున్నారు. ప్రజలు ముఖ్యంగా యువత తమ అభిరుచులకు అనుగుణంగా పాప్ కల్చర్‌లలో భాగం అవుతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్