Smartphone Vision Syndrome| రాత్రిళ్ళు ఫోన్ ఎక్కువగా చూస్తూ చూపు కోల్పోయిన మహిళ.. స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ కారణం!
Smartphone Vision Syndrome: స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీ కళ్లు పేలిపోయే వార్త ఇది, ఫోన్ ఎక్కువగా చూస్తూ ఓ హైదరాబాదీ యువతి కంటిచూపు కోల్పోయింది. దీనిని స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ అని వైద్యులు అంటున్నారు. మరింత తెలుసుకోండి..
ఒకప్పుడు టెలిఫోన్ ఉండేది, అది మాటలను కలిపేది, బంధుత్వాలను పెంచేది. ఎప్పుడయితే స్మార్ట్‌ఫోన్ వచ్చిందో మాటలు మితిమీరిపోవడం, బంధుత్వాలు తెగిపోవడం, ఆరోగ్యం చెడిపోవడం సహ ఇతర ఎన్నో అనర్థాలను కలిగిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు జీవితంలో ఒక భాగం కాదు, జీవితంలో అదే అధిక భాగం. జీవిత భాగస్వామి కంటే కూడా పెద్ద భాగాన్ని స్మార్ట్‌ఫోన్ ఆక్రమించుకుంటోంది. రోజులో గంటల తరబడి రాత్రనక, పగలనక స్మార్ట్‌ఫోన్ చూస్తూ గడిపేవారు మనలో చాలా మందే ఉన్నారు.
స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూడటం వలన అది శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపుతుంది, మొదటగా కంటిచూపుపై ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
హైదరాబాద్ నగరానికి చెందిన మంజు అనే ఓ 30 ఏళ్ల మహిళ, రాత్రి సమయంలో స్మార్ట్‌ఫోన్ ఎక్కువ చూస్తూ చూపు పోగొట్టుకుంది. ఆమె కంటిచూపు సమస్యను ఇటీవలే అపోలో హాస్పిటల్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మంజు గత 18 నెలలుగా అంధత్వంతో బాధపడిందని డాక్టర్ తెలిపారు, కారణం ఆమె ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ చూడటం, చీకట్లో కూడా స్మార్ట్‌ఫోన్ చూడటం వలన ఆమెకు ' స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్' సంభవించిందని తెలిపారు.
What is Smartphone Vision Syndrome - స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ అనేది దృష్టిలోపానికి చెందిన ఒక సమస్య. ఏదైనా డిజిటల్ డివైజ్ ప్రభావం చేత కళ్లు ఒత్తిడికి గురయినపుడు దృష్టి కోల్పోయే పరిస్థితి. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లు వంటి పరికరాలను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వలన కంటి చూపును డిసేబుల్ చేసే వివిధ లక్షణాలను కలిగిస్తుంది. దీనినే సాధారణంగా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) లేదా డిజిటల్ విజన్ సిండ్రోమ్' గా సూచిస్తారు. స్మార్ట్‌ఫోన్ చూస్తూ దృష్టి కోల్పోయిన సందర్భంలో దానిని స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ అని సంబోధిస్తున్నారు.
Smartphone Vision Syndrome Symptoms - లక్షణాలు ఎలా ఉంటాయి?
స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ పరిస్థితితో మంజు ఏదీ సరిగ్గా చూడలేకపోయేది. ఆమె కళ్లలో తరచుగా నక్షత్రాలను చూడటం, ప్రకాశవంతమైన కాంతి వెలుగులు, జిగ్-జాగ్ లైన్‌లు కనిపించేవి. కొన్ని సందర్భాలలో వస్తువులను చూడలేకపోవడం లేదా వాటిపై దృష్టి పెట్టలేకపోవడం వంటి లక్షణాలు గమనించినట్లు డాక్టర్ సుధీర్ వెల్లడించారు.
ఇంకా, స్క్రీన్ గ్లేరింగ్, దృష్టిలో అసమానతలు, అస్పష్టమైన దృష్టి, కాంతి సున్నితత్వం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చునని పలు నివేదికలు పేర్కొన్నాయి.
Smartphone Vision Syndrome Treatment- చికిత్స ఏమిటి?
ముందుగా స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ పరిస్థితి తలెత్తకుండా ఫోన్ వాడకం తగ్గించాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. అవసరమైతే తప్ప, ఫోన్ వైపు చూడవద్దు.
డిజిటల్ స్క్రీన్ ఉపయోగిస్తున్నప్పుడు 20-20-20 నియమం పాటించాలని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు. దీని అర్థం 20 నిమిషాల పాటు స్క్రీన్ చూసినపుడు 20 సెకన్ల విరామం తీసుకొని కనీసం 20 అడుగుల దూరంలో దేనినైనా చూడాలని సిఫారసు చేస్తున్నారు. ఈ పద్ధతి కంటిపై భారాన్ని తగ్గిస్తుంది.
స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోవాలి, కంటి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలి, కంటి ఆరోగ్యానికి అవసరమయ్యే ఆహారాలు తీసుకోవాలి ధ్యానం వంటి వ్యాయామాలు చేయాలి.
కళ్లు చాలా సున్నితమైనవి, కంటికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా, వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
సంబంధిత కథనం