స్మార్ట్‌ఫోన్ వ్యసనం ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే ప్రస్తుతం లభించే అధునాతన స్మార్ట్‌ఫోన్ మోడళ్లు స్క్రీన్ సమయాన్ని పర్యవేక్షించే ప్రత్యేకమైన ఇన్-బిల్ట్ అప్లికేషన్‌లతో వస్తున్నాయి. ఇలాంటి యాప్‌లు మనం రోజులో స్మార్ట్‌ఫోన్ ఎంతసేపు వినియోగించాం, ఎలాంటి యాప్‌లపై ఎక్కువ సమయం గడిపాము మొదలైన అన్ని రకాల సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను ఉపయోగించడం ద్వారా ఫోకస్డ్ లేదా మైండ్‌ఫుల్ సెల్‌ఫోన్ వినియోగాన్ని మెరుగుపరచవచ్చని తాజా పరిశోధన సూచించింది. వీటి వల్ల సెల్‌ఫోన్ వాడకం నియంత్రణలో ఉంటుంది. ఈ విధంగా స్క్రీన్ టైమ్ తగ్గడమే కాకుండా, అది అధిక ఉత్పాదకతకు దారితీస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుందని తాజా అధ్యయనంలో నిరూపితమైంది. ఈ అధ్యయనం డిజిటల్ గాడ్జెట్లలో స్వీయ పర్యవేక్షణను అందించే ఫీచర్‌లను పొందుపరచడానికి సిస్టమ్ డెవలపర్‌లను ప్రోత్సహిస్తుంది.