Steamed Egg Recipe । ఆవిరిలో ఉడికించిన గుడ్డు.. చపాతీతో తింటే వెరీ గుడ్!
31 March 2023, 6:30 IST
Steamed Egg Recipe: గుడ్డును ఫ్రై చేయకండి, ఉడికించకండి.. ఇలా ఆవిరి పట్టించి తింటే అదిరిపోతుంది. స్టీమ్డ్ ఎగ్ రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Steamed Egg Recipe
మీరు గుడ్లు తినడానికి ఇష్టపడతారా? అయితే మీకోసం ఒక స్పెషల్ రెసిపీని అందిస్తున్నాం. మీరు ఇప్పటివరకు గుడ్డు ఫ్రై, ఆమ్లెట్ లేదా ఉడికించిన గుడ్డు తిని ఉంటారు. అప్పుడప్పుడూ హాఫ్ బాయిల్డ్ చేసుకొని తిని ఉండవచ్చు. అయితే ఇక్కడ చెప్పుకోబోయేది ఇలా రెండు రకాలుగా వండినది కాదు, దీనిని పూర్తిగా ఆవిరిలో ఉడికించి చేస్తారు.
ఈ రెసిపీని కేవలం 10 నిమిషాల్లో తయారు చేయవచ్చు. దీనిని మీరు అల్పాహారంగా, మధ్యాహ్న భోజనంగా లేదా రాత్రి భోజనంగా కూడా తినవచ్చు. ఇందులో ఉల్లిపాయ, టమోటా, క్యాప్సికం , క్యారెట్ వంటి కూరగాయలు కలపడం వలన ఇది మరింత రుచికరమైన, పోషకభరితమైన ఆహారం అవుతుంది. మరి ఆలస్య చేయకుండా ఆవిరి గుడ్డు ఎలా చేయాలో ఈ కింద రెసిపీ చూసి తెలుసుకోండి.
Steamed Egg Recipe కోసం కావలసినవి
- 4 గుడ్లు
- 1/2 క్యాప్సికమ్
- 1 చిన్న టమోటా
- 1/2 ఉల్లిపాయ
- 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి
- 2 టేబుల్ స్పూన్లు తరిగిన క్యారెట్
- 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర
- 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్
- 1/2 టీస్పూన్ ఆలివ్ నూనె
- రుచికి తగినంత ఉప్పు
ఆవిరి గుడ్డు రెసిపీ- తయారీ విధానం
- ముందుగా ఒక గిన్నెలో గుడ్లు పగులగొట్టండి. అందులో ఉప్పు, నల్ల మిరియాల పొడి, వెల్లుల్లి పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా గిలకొట్టండి.
- ఇప్పుడు ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన కూరగాయ ముక్కలను వేసి మళ్లీ బాగా కలపాలి.
- ఆ తరువాత ఒక వెడల్పాటి కుండ లేదా పాత్రలో సగం వరకు నీటితో నింపి మరిగించాలి.
- ఇప్పుడు ఒక స్టీల్ టిఫింగ్ బాక్స్ లేదా కంటైనర్ తీసుకోండి. దాని లోపలవైపు కొద్దిగా నూనె వేసి మొత్తం పూయాలి, అంటుకోకుండా ఉండటానికి. ఇందులో గుడ్డు మిశ్రమాన్ని వేసి, మూత పెట్టి గట్టిగా మూసివేయండి.
- ఇప్పుడు ఈ స్టీల్ టిఫిన్ బాక్సును మరుగుతున్న నీటిలో నెమ్మదిగా విడిచి 10 నిమిషాలు ఉడకనివ్వండి.
- ఆ తర్వాత ఆవిరి మీద ఉడికించిన గుడ్డును బయటకు తీసి ముక్కలుగా కోయాలి.
అంతే, స్టీమ్డ్ ఎగ్ రెడీ. దీనిని చపాతీ లేదా బ్రెడ్ తో కలిపి తింటూ ఈ కొత్త రుచిని ఆస్వాదించండి.