తెలుగు న్యూస్  /  Lifestyle  /  Flashback Friday, Relive The Good Old Days All Over Again To Live The Life Fully And Happily

Flashback Friday । అందమైన నవ్వుతో అందించింది కాఫీ కప్పు.. కుదిరితే ఈ కథ చదవండి!

HT Telugu Desk HT Telugu

10 March 2023, 5:05 IST

    • Flashback Friday: మీ జీవితం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మీ జీవితంలోని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథ చదవండి, మీ ఆనందానికి ఇది దారి చూపుతుంది.
Flashback Friday
Flashback Friday (Pexels)

Flashback Friday

Flashback Friday: జీవితంలో కొందరికి అన్నీ ఉండవచ్చు, అయినంత మాత్రాన ఏ కష్టమూ లేనివారంటూ ఉండరు. కష్టం ఏ రూపంలో అయినా రావచ్చు, కొన్నిసార్లు అవి మనం కొనితెచ్చుకున్నవే అయి ఉండవచ్చు. రేపు ఎలా ఉంటుందో ఏమో అని ఈరోజు దాని గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని, ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం వృధా ప్రయాసే. రేపు అనేది రాకుండా పోదు, మనం ఆలోచించినంత మాత్రానా జరిగేది జరగకుండా ఆగిపోదు. చాలాసార్లు మనం అవసరమైన దానిపై దృష్టిపెట్టకుండా, మనల్ని ఎక్కువ ఆకర్షించే దానిపైన, అనవసర విషయాలపైన దృష్టిపెడతాం. ఈక్రమంలో అసలు విషయాన్ని మరిచిపోయి, కొసరు విషయం గురించి చింతిస్తాం. ఇక్కడ మనం ఒక నీతికథ చెప్పుకుందాం. ఈ కథ చాలా చాలా సాదాసీదాగా అనిపించే కథ అయినప్పటికీ మీ అందరి జ్ఞాపకాలను నెమరేసుకునేలా చేస్తుంది, ఎందుకంటే ఇది మనలో ఒకరి కథ కావచ్చు.

కథలోకి ఎంటర్ అయితే.. ఒకే కాలేజీలో చదువుకొన్న కొంతమంది స్నేహితులు చాలా కాలం తర్వాత కలుసుకోవాలనుకుంటారు. ఇందుకోసం వారి ప్రొఫెసర్ ఇల్లును తమ వేదిక చేసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రొఫెసర్ అంటే వారికి చాలా అభిమానం, ఆయన ఒక గురువుకంటే కూడా వారితో ఒక స్నేహితుడిగా ఉండేవారు. ఇక, అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి. ముందుగా నిర్ణయించిన తేదీలో వారంతా తమ ప్రొఫెసర్ ఇంటికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అక్కడ వారందరూ ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా పలకరించుకున్నారు. కాలేజీ విడిచిపెట్టిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడకు వెళ్లిపోయారు, ఏ విధంగా స్థిరపడ్డారు, జీవితంలో ఎలా ముందుకు సాగుతున్నారో ఒకరితో ఒకరు పంచుకున్నారు. కొంతమంది కార్పోరేట్ ప్రపంచంలో గొప్పగా ఎదిగితే, మరికొంత మంది ఉన్నచోటనే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థానాలను కలిగి ఉన్నారు, మరికొంత మంది వ్యాపారంలో రాణిస్తున్నారు, అలాగే కొద్దిమంది రాజకీయ నాయకులుగా ఎదిగారు. వారందరూ పెళ్లిళ్లు చేసుకుని అద్భుతమైన కుటుంబాన్ని కలిగి ఉన్నారు.

ఇంతవరకూ అంతా బాగానే ఉంది, వారి సంభాషణ మధ్యలో జీవితంలో ఒత్తిళ్లు, టెన్షన్స్ వైపు సంభాషణ మళ్లింది. వారందరూ వారు జీవితంలో అనుభవిస్తున్న కష్టాల గురించి మాట్లాడుకోసాగారు. అందరూ బాగా స్థిరపడిన వారే కానీ ఒక్కొక్కరుగా తమ కష్టాలను చెప్పుకుంటూ బాధపడుతున్నారు. ఇది గమనించిన ప్రొఫెసర్.. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని చెప్పి, లోపలున్న తన భార్యకు అందరికీ కాఫీ తేవాల్సిందిగా సూచిస్తారు.

ఒక 10-15 నిమిషాల తర్వాత, కాఫీ కప్పులతో ప్రొఫెసర్ అందమైన భార్య వంటగది నుంచి బయటకు వస్తుంది. ఆమె రూపం అపురూపం, ఆమె తన ఆహ్లాదకరమైన చిరునవ్వుతో అందరికీ కాఫీ అందిస్తుంది. ఒక విషయం ఏమిటంటే, ఆమె వివిధ రకాల కప్పులలో కాఫీ తెచ్చింది. క్రిస్టల్ కప్పులు, గాజు కప్పులు, సిరామిక్ కప్పులు, మెరిసేవి, కొన్ని సాదాసీదాగా ఇలా వివిధ రకాలు ఉన్నాయి. ఎక్కువ మంది అతిథుల కారణంగా ఒకే రకమైన కప్పులు ఉండకపోవచ్చని విద్యార్థులు భావించారు. వారికి నచ్చిన కప్పు తీసుకొని కాఫీ తాగుతూ ఉన్నారు, ఆపైన ప్రొఫెసర్ గారికి ఎంత మంచి భార్య ఉంది అంటూ అందులో కొందరు వారిలో వారు మాట్లాడుకోసాగారు. కొంతమంది కప్పుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు ఇలా మొత్తానికి టాపిక్ మారింది.

అప్పుడు ప్రొఫెసర్ మాట్లాడుతూ ఇలా అంటాడు 'మీరందరూ కాఫీ కప్పులు తీసుకున్నారు, ఖరీదైనవి, ఆకర్షణీయమైనవి ఎంచుకున్నారు, సాదాసీదాగా ఉన్నవి వదిలేశారు' అని అంటాడు. అదే లైఫ్ అంటే అని చెబుతాడు.

ప్రొఫెసర్ మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అపుడు ప్రొఫెసర్ మళ్లీ కొనసాగిస్తూ.. 'మీలో ప్రతి ఒక్కరికీ ఉత్తమమైన కప్పు కావాలి. మీ కోసం మీరు ఉత్తమమైన వాటిని మాత్రమే కోరుకోవడంలో తప్పులేదు, కానీ అదే మీ అసంతృప్తికి, జీవితంలో సమస్యలకు కారణం కావచ్చు. మనకు కావాల్సింది కాఫీ, కానీ మనం కోరుకునేది అందమైన, ఖరీదైన కప్పు. ఇలా కప్పు మోజులో పడి కాఫీని ఆస్వాదించలేరు. కానీ కప్పు కంటే కాఫీనే ముఖ్యం. జీవితమైనా అంతే మనం మనకు ముఖ్యమైన అసలు విషయం కాకుండా కొసరు విషయాలపైనే దృష్టిపెడతాం. జీవితం ఉన్నది ఎందుకు జీవించడానికి, ఆకర్షణలు, అనవసరపు విషయాలు పట్టించుకోకుండా మీకు నచ్చేలా జీవితాన్ని ఆస్వాదించండి' అని ఆ ప్రొఫెసర్ లెక్చర్ ఇస్తాడు. అప్పుడు వారికి బల్బ్ వెలుగుతుంది, కష్టాలు మామూలే, జీవితం ముఖ్యం అనే విషయాన్ని గ్రహిస్తారు. ఇదే సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. కథ సమాప్తం.!