Telugu News  /  Lifestyle  /  Who Is A Good Wife, Here Is What Chankaya Niti Defines About Spouse
Good Wife Definition- Chanakya Niti
Good Wife Definition- Chanakya Niti (istock)

Good Wife | మంచి భార్య అంటే ఎలా ఉండాలి.. చాణక్యుడు అర్థాంగికి ఇచ్చిన అర్థం ఇదే!

19 January 2023, 19:53 ISTHT Telugu Desk
19 January 2023, 19:53 IST

Good Wife Definition- Chanakya Niti: మంచి భార్య అంటే ఎలా ఉండాలి? రూపవతిగా ఉండాలా, గుణవతిగా ఉండాలా? అర్థాంగికి ఆచార్య చాణక్యుడు ఇచ్చిన నిర్వచనం ఇదే.

వైవాహిక జీవితంలో భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నప్పుడే వారి సంసారం సుఖంగా సాగుతుంది. ఇందులో భార్య స్థానం ప్రత్యేకమైనది. భార్య అంటే భర్తలో సగభాగం అందుకే భార్యను అర్థాంగి అంటారు. ప్రతీ భర్త విజయం వెనక భార్య పాత్ర ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

ఆచార్య చాణక్యుడు పురాతన భారతదేశంలో ఒక గొప్ప మేధావి, ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మానవులను ఎక్కువగా ప్రభావితం చేసే అనేక అంశాలపై అధ్యయనం చేశారు. వ్యక్తుల స్వభావాన్ని, వారి మధ్య సంబంధ బాంధవ్యాలను సూక్ష్మంగా అర్థం చేసుకున్నారు.

ఇందులో భాగంగా సంతోషకరమైన వైవాహిక జీవితం ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తాడని చాణక్యుడు బలంగా నమ్మారు. తన జ్ఞానాన్ని 'నీతిశాస్త్రం' రూపంలో (Chanakya Niti) ప్రజలకు పంచి ఇచ్చారు. చాణక్యుడి నీతిశాస్త్రం భార్యాభర్తల సంబంధాన్ని తెలియజెప్పే శాస్త్రం కానప్పటికీ, ఇందులో వివాహం, భార్య పాత్ర గురించి సూచనలు ఉన్నాయి.

Good Wife Definition- మంచి భార్యకు నిర్వచనం

మంచి భార్య అనడానికి ఆచార్య చాణక్యుడి ఇచ్చిన నిర్వచనం ఇలా ఉంది... భార్య అంటే ఉదయం తన భర్తకు తల్లిలా సేవ చేసి, పగటిపూట సోదరిలా ప్రేమించి, రాత్రి వేశ్యలా సంతోషపెట్టేది.

ప్రతి వ్యక్తి తన భార్యతో విజయవంతమైన వైవాహిక జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. మరి మంచి భార్య అంటే ఎలా ఉండాలి? మంచి భార్య గురించి చాణక్యుడి చెప్పిన నీతి సూత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అందమైన భార్య- మంచి కుటుంబం

చాణక్య నీతి ప్రకారం, ఒక అమ్మాయిని భార్యగా పొందాలనుకున్నప్పుడు ఆమె అందాన్ని పరిగణలోకి తీసుకోకూడదని చెప్పారు. అమ్మాయి అందంగా ఉన్నప్పటికీ మంచి కుటుంబానికి చెందకపోతే ఆమెతో పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. అమ్మాయి అందంగా లేకపోయినా మంచి కుటుంబం నుంచి వచ్చినది అయితే, పెళ్లి చేసుకోవాలని చెప్పారు. మన కుటుంబానికి సమాన స్థాయి కలిగిన కుటుంబంలోని అమ్మాయిని వివాహం చేసుకోవాలని అన్నారు.

ప్రేమగల, నిజాయితీగల భార్య

భార్యాభర్తల మధ్య వివాహబంధం విజయవంతం కావాలంటే వారి మధ్య ప్రేమ ఉండాలని చెప్పారు. భార్యకు నిజమైన ఆనందం భర్తకు సేవ చేయడంలోనే ఉంటుందని తెలిపారు. భార్య తన భర్తను ప్రేమించాలి, నిజం మాట్లాడాలి. ఈ రకమైన భార్య ప్రవర్తన వారి కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తుంది. . భార్య తన భర్త సమ్మతితో చేసే ఏ పని అయినా తనకు, తన కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుందని భార్య అర్థం చేసుకోవాలి.

మంచి భార్య గొడవ పడదు

చాణక్యుడి ప్రకారం, భార్య ఎటువంటి కారణం లేకుండా భర్తతో గొడవ పడకూడదు. భోజనం చేసే సమయంలో భర్తను తల్లిలా చూసుకోవడం, రోజులో భర్తకు సోదరిలా ప్రేమను పంచడం, అలాగే దాసిలా భర్తకు సేవ చేయడం, సంభోగ సమయంలో వేశ్యలా ప్రవర్తించడం మంచి భార్య అని చాణక్యుడు చెప్పారు. ఇలాంటి భార్య అందంగా లేకపోయినా, తన భర్త నిజమైన ప్రేమను పొందుతుంది. వారి కుటుంబం పచ్చగా ఉంటుంది.

తెలివిగల భార్య

భర్తతో నిజాయితీగా, ప్రేమగా ఉండటంతో పాటు తెలివిగల భార్య ఉండాలని చాణక్యులు అన్నారు. నిజాయితీగా, తెలివిగల, ప్రేమగల అమ్మాయి దొరకడం అదృష్టంగా పేర్కొన్నారు. తెలివైన భార్య తన కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటుందని చెప్పారు. ఒక గురువులాగా, స్నేహితుడిలాగా భర్తకు మంచి సలహాలు ఇస్తుందని చెప్పారు. ఇలాంటి భార్యలను ఎవరైనా చెడుదృష్టితో చూస్తే వారు మహా పాపులు అని పేర్కొన్నారు.